ముంబై, జూలై 10 : దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండోరోజూ గురువారం కూడా భారీగా నష్టపోయాయి. ఐటీ, టెలికాం రంగ షేర్లలో అమ్మకాలు పోటెత్తడంతో ఇరు సూచీలు తీవ్ర ఒత్తిడికి గురయ్యాయి. టారిఫ్ విధింపునకు సంబంధించి ఇంకా స్పష్టత రాకపోవడంతో మదుపరులు అమ్మకాలకు మొగ్గుచూపారు. ఫలితంలో ఇంట్రాడేలో 400 పాయింట్లకు పైగా నష్టపోయిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ చివరకు మార్కెట్ ముగిసే సమయానికి 345.80 పాయింట్లు నష్టపోయి 83,190.28 వద్ద ముగిసింది.
మార్కెట్లో రెండు వేలకు పైగా సూచీలు లాభపడగా..1,959 సూచీలు నష్టపోయాయి. మరోసూచీ నిఫ్టీ 120.85 పాయింట్లు కోల్పోయి 25,355.25 పాయింట్ల వద్ద స్థిరపడింది. మార్కెట్లో భారతీ ఎయిర్టెల్, ఏషియన్ పెయింట్స్, ఇన్ఫోసిస్, భారత్ ఎలక్ట్రానిక్స్, టెక్ మహీంద్రా, ఎటర్నల్ షేర్లు నష్టపోగా..మారుతి, టాటా స్టీల్, బజాజ్ ఫైనాన్స్, ట్రెంట్, టీసీఎస్ షేర్లు లాభాల్లో ముగిశాయి. టెక్నాలజీ రంగ సూచీ 1.17 శాతం నష్టపోగా..టెలికాం 1.11 శాతం, ఐటీ, కన్జ్యూమర్ డ్యూరబుల్ షేర్లు నష్టపోయాయి.