Stock Market : దేశీయ స్టాక్ మార్కెట్లపై బడ్జెట్ దెబ్బ పడింది. ఇవాళ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ క్రమంలో ముందస్తు అంచనాలు స్టాక్ మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపాయి. ఇవాళ ఉదయం స్టాక్ మార్కెట్ ప్రారంభ సమయంలో బీఎస్ఈ సెన్సెక్స్ 250 పాయింట్లకు పైగా పెరిగింది. కానీ క్రమంగా నష్టాలు చవిచూసింది. కాసేపట్లోనే లాభాలన్నీ ఆవిరయ్యాయి. అటు ఎన్ఎస్ఈ నిఫ్టీ కూడా నష్టాల్లోనే కొనసాగుతోంది.
ఇవాళ మధ్యాహ్నానికి బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ సెన్సెక్స్ 1000 కిపైగా పాయింట్ల నష్టంతో 80 వేల మార్క్ దిగువన ట్రేడవుతోంది. అదేవిధంగా నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ నిఫ్టీ కూడా 300 పాయింట్లకు పైగా నష్టంతో 24,200 వద్ద కొనసాగుతోంది. అటు అమెరికన్ డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ కూడా దారుణంగా 83.69కి పడిపోయింది.
క్యాపిటల్ గెయిన్స్ పైన, ట్రేడింగ్ డెరివేటివ్స్ పైన పన్నుల పెంపునకు సంబంధించి ఈ బడ్జెట్లో కేంద్రం చేసిన ప్రతిపాదనలు స్టాక్ మార్కెట్లపై ప్రభావం చూపాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అటు రూపాయి మారకం విలువ పతనం కూడా మార్కెట్లపై ప్రభావం చూపిందని అంటున్నారు.