Stock Market | దేశీయ బెంచ్ మార్క్ సూచీలు మంగళవారం లాభాల్లో ముగిశాయి. ఉదయం సూచీలు లాభాల్లో మొదలయ్యాయి. ఆ తర్వాత అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి. పలు షేర్లలో కొనుగోళ్ల మద్దతుతో సూచీలు మరోసారి జీవితకాల గరిష్ఠానికి చేరుకున్నాయి. ఉదయం సెన్సెక్స్ 71,479.28 పాయింట్ల వద్ద లాభాలతో మొదలైంది. ఆ తర్వాత ఒడిదొడుకులను ఎదుర్కొన్నది. ఇంట్రాడేలో 71,071 కనిష్ఠాన్ని తాకిన సెన్సెక్స్.. ఆ తర్వాత మళ్లీ కోలుకొని 71,623.71 పాయింట్ల పాయింట్ల గరిష్ఠానికి చేరుకుంది. చివరకు 122.10 పాయింట్ల లాభంతో 71,437.19 వద్ద ముగిసింది. నిఫ్టీ 34.45 పాయింట్ల లాభంతో 21,453.10 వద్ద స్థిరపడింది.
ట్రేడింగ్‌లో దాదాపు 1,833 షేర్లు పురోగమించగా.. 1797 షేర్లు క్షీణించాయి. 132 షేర్లు మాత్రం మారలేదు. నిఫ్టీలో కోల్ ఇండియా, నెస్లే ఇండియా, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, ఎన్టీపీసీ, సిప్లా అత్యధికంగా లాభపడ్డాయి. నష్టపోయిన వాటిలో ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, హీరో మోటోకార్ప్, అదానీ పోర్ట్స్, విప్రో, అదానీ ఎంటర్ప్రైజెస్ ఉన్నాయి. మెటల్, ఫార్మా, ఆయిల్ అండ్ గ్యాస్, పవర్, ఎఫ్ఎంసీజీ షేర్లు ఒకశాతం వరకు పెరిగాయి. ఆటో, క్యాపిటల్ గూడ్స్, రియల్టీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 0.3శాతం నుంచి 0.8 శాతం పతనమయ్యాయి. స్మాల్‌క్యాప్ 42,544.95 పాయింట్ల గరిష్ఠాన్ని నమోదు చేసింది. బీఎస్ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.3 శాతం నష్టపోయింది.