Break Up | బాలీవుడ్లో చిలుకా–గోరింకల్లా తిరుగుతూ అందమైన జంటగా గుర్తింపు తెచ్చుకున్న వీర్ పహారియా – తారా సుతారియా బ్రేకప్ పుకార్లు జోరుగా వినిపిస్తున్నాయి. ఒకరి పుట్టినరోజు వేడుకల్లో ఒకరు సందడి చేయడం, విదేశీ టూర్లు, ఎయిర్‌పోర్ట్‌లలో కెమెరాల కళ్లకు చిక్కడం వంటి సందర్భాలతో ఈ జంట ఎప్పుడూ వార్తల్లో నిలిచేది. సోషల్ మీడియాలో ఒకరిపై ఒకరు ప్రేమను వ్యక్తపరుస్తూ పోస్టులు పెట్టడం కూడా వారి అభిమానులను ఆకట్టుకునేది. అయితే ఇటీవల కాలంలో వీరిద్దరి మధ్య దూరం పెరిగిందనే సంకేతాలు కనిపించడంతో నెటిజన్లలో చర్చ మొదలైంది. కొద్ది రోజులుగా ఈ జంట బ్రేకప్ అయ్యారనే ప్రచారం వేగంగా వ్యాపిస్తోంది.
ముఖ్యంగా ఒక లైవ్ షోలో గాయకుడు ఏపీ థిల్లాన్ తారాకు ముద్దు పెట్టిన వీడియో వైరల్ అయిన తర్వాత ఈ పుకార్లు మరింత ఉధృతమయ్యాయి. అప్పటి నుంచి వీరిద్దరూ కలిసి ఎక్కడా కనిపించకపోవడం, సోషల్ మీడియాలో ఒకరిని ఒకరు ప్రస్తావించకపోవడం అనుమానాలకు తావిస్తోంది. గతంలో చిన్న సందర్భానికైనా ఎమోషనల్ పోస్టులు పెట్టే తారా, ఈసారి వీర్ పుట్టినరోజుకు శుభాకాంక్షలు కూడా తెలియజేయకపోవడం అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది. కనీసం ఒక ఫోటో, ఒక ఎమోజీ కూడా షేర్ చేయకపోవడం వారి మధ్య ఏదో జరిగిందనే ఊహాగానాలకు బలం చేకూర్చింది.ఇటీవల జరిగిన వీర్ పహారియా బర్త్‌డే పార్టీ కూడా ఈ చర్చను మరింత పెంచింది. ఆ వేడుకల్లో జాన్వీ కపూర్, నైసా దేవగన్, బాద్షా, రియా చక్రవర్తి వంటి పలువురు ప్రముఖులు హాజరైనప్పటికీ తారా సుతారియా మాత్రం కనిపించలేదు.
గత కొన్ని నెలలుగా వీరిద్దరూ కలిసి ఏ పార్టీలోనూ, ఈవెంట్లోనూ కనిపించకపోవడం కూడా బ్రేకప్ వార్తలకు ఆజ్యం పోస్తోంది. ఇన్సైడ్ వర్గాల ప్రకారం ఇద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తినట్లు ప్రచారం జరుగుతుండగా, మరికొందరు మాత్రం పుకార్లకు చెక్ పెట్టేందుకే తమ సంబంధాన్ని రహస్యంగా ఉంచుతున్నారని అభిప్రాయపడుతున్నారు. అయితే బాలీవుడ్లో సాధారణంగా ఇలాంటి మౌనం కనిపిస్తే అది విడిపోవడానికి సంకేతమనే అభిప్రాయం కూడా బలంగా ఉంది. ఇదిలా ఉండగా ఈ వార్తలపై వీర్ గానీ, తారా గానీ అధికారికంగా స్పందించలేదు. ప్రస్తుతం ఇద్దరూ తమ తమ కెరీర్లపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. తారా సుతారియా నటించిన ‘టాక్సిక్’ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతుండగా, వీర్ పహారియా తన తదుపరి ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నాడు.