Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లలో బుల్ జోరు కొనసాగుతున్నది. ఇటీవల వరుసగా సూచీలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. ఇప్పటికే పలుసార్లు జీవికాల గరిష్ఠానికి చేరిన సూచీలు బుధవారం మరోసారి కొత్త రికార్డులను సృష్టించాయి. విదేశీ మదుపరుల కొనుగోళ్లు, అమెరికా మార్కెట్లలో సానుకూల ప్రభావం దేశీయ మార్కెట్లపై పడడంతో సూచీలు రికార్డులు తిరగరాస్తున్నాయి. సూచీలు గరిష్ఠాలను నమోదు చేసినా.. ఓ దశలో అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి. అయినా కోలుకొని సరికొత్త రికార్డులను నమోదు చేశాయి.
సెన్సెక్స్ 67వేల మార్క్‌ను దాటగా.. నిఫ్టీ 19,800 పాయింట్ల ఎగున ముగిసింది. బుధవారం ఉదయం సెన్సెక్ 66,905 పాయింట్ల వద్ద లాభాలతో ప్రారంభమైంది. సెనెక్స్ లాభాలతోనే మొదలైనా.. ట్రేడింగ్ కొనసాగుతున్న కొద్దీ.. అమ్మకాలతో నష్టాల్లోకి వెళ్లింది. ఇంట్రాడేలో 66,703 పాయింట్ల వద్ద కనిష్ఠానికి చేరింది. కొద్దిసేపటికి మళ్లీ పుంజుకొని 67,171 పాయింట్ల పాయింట్ల గరిష్టాన్ని తాకింది. చివరకు 302.30 పాయింట్ల లాభంతో 67,097 వద్ద ముగిసింది.
మరో వైపు నిఫ్టీ తొలిసారిగా 19,800 మార్క్‌ను దాటింది. 83.90 పాయింట్ల లాభంతో 19,833.15 వద్ద స్థిరపడింది. నిఫ్టీలో ఎన్టీపీసీ, బజాజ్ ఫైనాన్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్, బజాజ్ ఫిన్సర్వ్ అత్యధికంగా లాభపడగా.. హిందాల్కో ఇండస్ట్రీస్, బజాజ్ ఆటో, హీరో మోటోకార్ప్, టీసీఎస్, మారుతీ సుజుకీ నష్టపోయాయి. పీఎస్‌యూ బ్యాంక్ 2 శాతం, పవర్ హెల్త్‌కేర్, ఆయిల్ అండ్ గ్యాస్ 0.5 శాతం చొప్పున పెరగడంతో అన్ని రంగాల షేర్లు లాభాల్లో ముగిశాయి. బీఎస్ఈ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 0.6 శాతం చొప్పున పెరిగాయి.