Stock Market : దేశీయ స్టాక్ మార్కెట్లు (Stock markets) మంగళవారం తీవ్ర ఒడిదుడుకులతో సాగి చివరికి నష్టాలతో ముగిశాయి. గడిచిన సెషన్లో అమెరికా-ఇరాన్ (US-Iran) శాంతి చర్చల పురోగతితో దాదాపు వెయ్యి పాయింట్లకుపైగా లాభపడ్డ మార్కెట్లు.. ఇవాళ ఆ జోరును కొనసాగించలేకపోయాయి. దక్షిణ ఇరాన్‌లోని క్షిపణి కేంద్రాలపై అమెరికా దళాలు మళ్లీ దాడులు ప్రారంభించాయన్న వార్తలు, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలలో మళ్లీ కనిపిస్తున్న కదలికలు మదుపరులలో ఆందోళనలను పెంచాయి. దీనికి తోడు ఇవాళ నెలవారీ డెరివేటివ్స్ ఆప్షన్స్ గడువు ముగిసే రోజు కావడంతో మార్కెట్లలో హెచ్చుతగ్గులు మరింత తీవ్రమయ్యాయి.
మంగళవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి దేశీయ బెంచ్‌మార్క్ సూచీలు దాదాపు అర శాతం మేర నష్టపోయాయి. అంతకుముందు సెషన్‌తో పోలిస్తే బీఎస్ఈ సెన్సెక్స్ సుమారు 479 పాయింట్లు క్షీణించి 76,009.7 పాయింట్ల వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 సైతం కీలకమైన 24,000 మార్కును కోల్పోయి దాదాపు 118 పాయింట్ల నష్టంతో 23,913.7 పాయింట్ల వద్ద ముగిసింది. మార్కెట్లు ఉదయం నష్టాలతో ప్రారంభమైనప్పటికీ ఒక దశలో ఐటీ, ఆటో రంగాల మద్దతుతో కోలుకున్నాయి. మధ్యాహ్నం తర్వాత ఫైనాన్స్, రియల్టీ రంగాలలో పెరిగిన లాభాల స్వీకరణ కారణంగా దలాల్ స్ట్రీట్ మళ్లీ రెడ్ జోన్లోకి జారుకుంది.
ఈ ప్రతికూల పరిస్థితుల్లోనూ కొన్ని దిగ్గజ కంపెనీల షేర్లు కొనుగోళ్ల మద్దతును పొంది లాభాల్లో ముగిశాయి. ముఖ్యంగా అదానీ ఎంటర్ప్రైజెస్ షేరు నేటి ట్రేడింగ్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి, దాదాపు 3.92 శాతం లాభంతో రూ. 2,961.3 వద్ద స్థిరపడింది. ఆటోమొబైల్ రంగానికి చెందిన టాటా మోటార్స్ షేరు కూడా 3.58 శాతం వృద్ధితో రూ. 386.6 వద్ద ముగిసింది. ఐటీ విభాగం నుండి టెక్ మహీంద్రా షేరు 0.96 శాతం లాభపడి రూ.1,449.3 వద్ద ముగియగా, ఎటర్నల్ లిమిటెడ్ షేరు 0.84 శాతం లాభాన్ని నమోదు చేసింది.