Sensex : భారతీయ స్టాక్ మార్కెట్లు గురువారం నాలుగోరోజు కూడా వరుసగా నష్టాలు చవిచూశాయి. గురువారం సెన్సెక్స్ 780.18 పాయింట్ల వరకు నష్టపోయింది. నిఫ్టీ 263.90 పాయింట్లు నష్టపోయింది. సెన్సెక్స్ 780.18 పాయింట్ల (0.92 శాతం) నష్టంతో 84,180.96 వద్ద ముగియా, నిఫ్టీ 263.90 పాయింట్లు (1 శాతం) నష్టపోయి 25,876.85 వద్ద ముగిసింది.
గడిచిన నాలుగు రోజుల్లో మొత్తంగా 1,500 పాయింట్లు (1.7 శాతం) నష్టపోయిన సెన్సెక్స్.. రూ.9.19 లక్షల కోట్ల నష్టాల్ని మిగిల్చింది. దీంతో ప్రస్తుత భారత కంపెనీల విలువ రూ.472 లక్షల కోట్లకు దిగజారింది. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు ఆపకుంటే.. ఇండియాపై 500 శాతం పన్నులు విధిస్తామనే ట్రంప్ హెచ్చరికలతో మార్కెట్లు భారీ నష్టాల్ని చవిచూడాల్సి వచ్చింది. అలాగే విదేశీ ఇన్వెస్టర్లు అమ్మకాలకు పాల్పడటం, వెనెజువెలా సంక్షోభం వంటి అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు కూడా మార్కెట్ నష్టాలకు కారణాలుగా మారాయి.
సెన్సెక్స్ నష్టాలతోనే ప్రారంభమైంది. ఏ దశలోనూ కోలుకోలేకపోయింది. ఒకదశలో సెన్సెక్స్ 800 పాయింట్ల వరకు నష్టపోయింది. ఇక డాలర్ తో రూపాయి మారకం విలువ 89.95గా ఉంది. దేశీయ సంస్థల్లో ఐసీఐసీఐ, బజాజ్ ఫైనాన్స్, ఎటెర్నల్, బీఈఎల్ వంటి సంస్థలు మినహా మిగిలిన సంస్థలు నష్టాల బాటలోనే ముగిశాయి.