Stock Market | దేశీయ బెంచ్ మార్క్ సూచీలు బుధవారం భారీ నష్టాల్లో ముగిశాయి. వరుస మూడు రోజుల లాభాల తర్వాత మంగళవారం లాభాల్లో ముగిసిన సూచీలు.. మరోసారి నష్టాల్లో పయనించాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాలతో అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి. ఓ వైపు ముడిచమురు ధరల పెరుగుదల, ఇజ్రాయెల్ యుద్ధం తీవ్రరూపు దాలుస్తున్న నేపథ్యంలో అప్రమత్తంగా వ్యవహరించారు. దీనికి తోడు చైనాలో త్రైమాసిక ప్రాతిపదికన జీడీపీ వృద్ధిరేటు నెమ్మదించడం మార్కెట్‌పై ప్రభావం చూపింది. ఉదయం 66,473.74 వద్ద మొదలైన సెన్సెక్స్.. ఇంట్రాడేలో 65,842.10 పాయింట్ల గరిష్ఠానికి చేరింది.
చివరకు 551.07 పాయింట్ల నష్టంతో 65,877.02 వద్ద ముగిసింది. నిఫ్టీ 140.40 పాయింట్లు పతనమై 19,671.10 వద్ద స్థిరపడింది. బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్, ఎన్టీపీసీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ అత్యధికంగా నష్టపోయాయి. సిప్లా, డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్, టాటా మోటార్స్, సన్ ఫార్మా, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ లాభాల్లో ముగిశాయి. ఆటో, ఫార్మా మినహా మిగిలిన అన్ని రంగాల సూచీలు పవర్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఆయిల్ అండ్ గ్యాస్, మెటల్, రియాల్టీ, బ్యాంక్ 0.5-1 శాతం చొప్పున నష్టాల్లో ముగిశాయి. బీఎస్ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.8 శాతం, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.3 శాతం తగ్గాయి.