Stock Market | దేశీయ బెంచ్ మార్క్ సూచీలు వారంలో తొలిరోజైన సోమవారం భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 500 పాయింట్లకుపైగా లాభపడగా.. నిఫ్టీ తొలిసారిగా 20వేల పాయింట్ల మార్క్‌ను తాకింది. సోమవారం ఉదయం 209 పాయింట్లకుపైగా పెరిగి 66,808 వద్ద మొదలైంది. నిఫ్టీ సైతం 72 పాయింట్లకుపైగా లాభంతో 19,892 వద్ద ప్రారంభమైంది. ఆ తర్వాత అదే జోరును కొనసాగించాయి. ఒక దశలో సెన్సెక్స్ 67,150 పాయింట్ల వరకు చేరింది.
చివరకు 528 పాయింట్లతో 67,127.08 వద్ద స్థిరపడింది. మరో వైపు నిఫ్టీ జీవనకాలంలో తొలిసారిగా 20వేల పాయింట్లను దాటింది. ఏకంగా 20,004.45 వరకు గరిష్ఠానికి చేరిన నిఫ్టీ చివరకు 176.40 పాయింట్ల లాభంతో 19996.35 వద్ద స్థిరపడింది. నిఫ్టీలో అత్యధికంగా అదానీ పోర్ట్స్, అదానీ ఎంటర్ప్రైజెస్, అపోలో హాస్పిటల్స్, యాక్సిస్ బ్యాంక్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ లాభపడ్డాయి. నష్టపోయిన వాటిలో జియో ఫైనాన్షియల్, కోల్ ఇండియా, ఓఎన్జీసీ, బజాజ్ ఫైనాన్స్, ఎల్అండ్టీ ఉన్నాయి.