Stock Market | దేశీయ బెంచ్ మార్క్ సూచీలు అమ్మకాలతో ఒత్తిడికి గురయ్యాయి. నిన్న భారీ లాభాలను ఆర్జించిన సూచీలు మంగళవారం జోరును కనబరుస్తూ లాభాల్లో ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత గరిష్టాల వద్ద అమ్మకాల ఒత్తిడికి గురికావడంతో వారం రోజుల వరుస లాభాలకు బ్రేక్ పడ్డట్లయ్యింది. ఇటీవల వరుస లాభాల నేపథ్యంలో.. మదుపరులు లాభాలకు దిగడంతో అస్థిరతకు గురై చివరకు సూచీలు మిశ్రమంగా ముగిశాయి. రిటైల్ ద్రవ్యోల్బణం, పారిశ్రామికోత్పత్తి గణాంకాల నేపథ్యంలోనూ మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరించారు. సెన్సెక్స్ 94.05 పాయింట్ల లాభంతో 67,221.13 స్థిరపడగా.. నిఫ్టీ చివరకు 3.15 పాయింట్లు నష్టపోయి 19,993.20 వద్ద ముగిసింది.
దాదాపు 689 షేర్లు పురోగమించగా.. 2,882 షేర్లు పతనమయ్యాయి. 118 షేర్లు మారలేదు. నిఫ్టీలో టీసీఎస్, ఎల్అండ్టీ, ఇన్ఫోసిస్, దివీస్ ల్యాబ్స్, అల్ట్రాటెక్ సిమెంట్ టాప్ గెయినర్స్ నిలువగా.. బీపీసీఎల్, పవర్ గ్రిడ్ కార్ప్, ఎన్టీపీసీ, అదానీ ఎంటర్ప్రైజెస్, కోల్ ఇండియా టాప్ లూజర్స్‌గా నిలిచాయి. రంగాల వారీగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఒక శాతం లాభపడగా.. ఆటో, క్యాపిటల్ గూడ్స్, పవర్, ఆయిల్ అండ్ గ్యాస్, మెటల్, రియాల్టీ ఒక్కొక్కటి ఒకటి నుంచి మూడు శాతం వరకు క్షీణించడంతో అన్నిరంగాల సూచీలు నష్టాల్లోనే ముగిశాయి. బీఎస్ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 3శాతం క్షీణించగా.. స్మాల్ క్యాప్ ఇండెక్స్ 4 శాతం తగ్గింది.