Junk Food | ప్రజారోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపుతున్న అల్ట్రా-ప్రాసెస్డ్ ఫుడ్స్ (UPFs)ను సిగరెట్ల మాదిరిగానే కఠినంగా నియంత్రించాలని తాజా అకడమిక్ అధ్యయనం సూచించింది. హార్వర్డ్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ మిషిగన్, డ్యూక్ యూనివర్సిటీలకు చెందిన పరిశోధకులు సంయుక్తంగా నిర్వహించిన ఈ అధ్యయనం తాలూకు వివరాలను ఇటీవలే ఆరోగ్య రంగానికి చెందిన ప్రతిష్ఠాత్మక జర్నల్ ది మిల్‌బ్యాంక్ క్వార్టర్లీలో ప్రచురించారు. ఈ అధ్యయనం ప్రకారం అల్ట్రా-ప్రాసెస్డ్ ఫుడ్స్, పొగాకు ఉత్పత్తుల మధ్య ఆశ్చర్యకరమైన పోలికలు ఉన్నట్లు గుర్తించారు. సాఫ్ట్ డ్రింక్స్, ప్యాకేజ్డ్ స్నాక్స్, బిస్కెట్లు, చిప్స్ వంటి పారిశ్రామికంగా తయారయ్యే ఆహారాలు కృత్రిమ రుచులు, రంగులు, ఎమల్సిఫైయర్లు, ప్రిజర్వేటివ్‌లతో నిండి ఉంటాయని పరిశోధకులు తెలిపారు. ఇవి ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా వినియోగంలో ఉన్నాయని హెచ్చరించారు.
పొగాకు ఉత్పత్తుల మాదిరిగానే UPFsను కూడా మళ్లీ మళ్లీ తినేలా ఉద్దేశపూర్వకంగా డిజైన్ చేస్తున్నారని అధ్యయనం పేర్కొంది. రుచి, ఆకారం, రంగు ఆకర్షణీయంగా ఉండేలా పలు రసాయన సమ్మేళనాలను ఉపయోగించి ఆయా పదార్థాలను తయారు చేస్తున్నారని తేల్చారు. ఇవి మెదడులోని పలు భాగాలను ఉత్తేజ పరుస్తాయని, దీంతో ఆయా ఆహారాలను తినాలనే కోరిక లేదా, అలవాటు పెరుగుతుందని అన్నారు. ఈ క్రమంలోనే UPFsను ప్రజలు అధికంగా తీసుకుంటున్నారని తెలిపారు. వారు అలా వాటిని అధికంగా తీసుకునేలా తయారీదారులు వాటిని తయారు చేస్తున్నారని పరిశోధకులు విశ్లేషించారు. కాగా మార్కెటింగ్ విధానాలపైనా ఈ అధ్యయనం తీవ్ర విమర్శలు చేసింది. లో ఫ్యాట్, షుగర్ ఫ్రీ వంటి లేబుళ్లను వినియోగదారులను తప్పుదోవ పట్టించే ప్రకటనలుగా పేర్కొంది. 1950లలో సిగరెట్ ఫిల్టర్లను సేఫ్ గా ప్రచారం చేసిన తీరుతో ఇవి చాలా సమానమని పోల్చిచెప్పింది. అవి ఆరోగ్యానికి పెద్దగా రక్షణ ఇవ్వకపోయినా, భద్రతా భావన కల్పించినట్లేనని అన్నారు.
ఈ అధ్యయనానికి సహ రచయిత, యూనివర్సిటీ ఆఫ్ మిషిగన్ ప్రొఫెసర్ అయిన ఆష్లే గేర్‌హార్డ్ తన రోగులు ఆహార కోరికలను నికోటిన్ వ్యసనంతో పోల్చుతూ వివరిస్తారని తెలిపారు. కొందరు మాజీ ధూమపాన ప్రియులు సిగరెట్లను మానేసిన తర్వాత ఫిజీ డ్రింక్స్, చక్కెర అధికంగా ఉండే స్నాక్స్‌కు అలవాటు పడినట్లు చెప్పారని ఆమె వెల్లడించారు. ఆహారం జీవనానికి అవసరం, పొగాకు అవసరం కాదు. అయినా ఇదే కారణంగా UPFs నియంత్రణ మరింత అత్యవసరమని పరిశోధకులు అభిప్రాయపడ్డారు. ఆధునిక ఆహార వాతావరణంలో హానికరమైన ఆహారాలను పూర్తిగా తప్పించుకోవడం సాధ్యం కాదని, అందుకే ప్రభుత్వ జోక్యం అవసరమని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పొగాకు నియంత్రణ విధానాల నుంచి పాఠాలు తీసుకుని, కఠినమైన మార్కెటింగ్ పరిమితులు, చట్టపరమైన చర్యలు, పరిశ్రమ బాధ్యత పెంపు వంటి చర్యలు తీసుకోవాలని అధ్యయనం పిలుపునిచ్చింది.
అయితే, కొంతమంది నిపుణులు జాగ్రత్తలు సూచించారు. క్వాడ్రం ఇన్స్టిట్యూట్కు చెందిన మార్టిన్ వారెన్ UPFs ప్రభావాలను నికోటిన్ వ్యసనంతో పూర్తిగా పోల్చడం అతిశయోక్తి కావచ్చని అన్నారు. UPFs ఆరోగ్యానికి హానికరం కావడం, అవి ఆరోగ్యకరమైన ఆహారాన్ని భర్తీ చేయడమే ప్రధాన కారణం కావచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. కాగా ఆఫ్రికా దేశాల్లో ప్రజారోగ్య నేతలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. UPFs వినియోగం పెరుగుతుండటంతో, నాన్-కమ్యూనికబుల్ వ్యాధులు విస్తరిస్తున్నాయని, ఇది ఆరోగ్య వ్యవస్థలపై పెనుభారంగా మారుతోందని వారు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో అల్ట్రా-ప్రాసెస్డ్ ఆహారాలపై సిగరెట్ల స్థాయిలో నియంత్రణ అవసరమా? అన్న చర్చను ఈ అధ్యయనం గ్లోబల్ స్థాయిలో మరింత విస్తృతం చేసిందని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. అయితే UPFs పై ప్రభుత్వాలు ఎలాంటి చర్యలను తీసుకుంటాయో వేచి చూస్తే తెలుస్తుంది.