Stock Market | దేశీయ బెంచ్ మార్క్ సూచీలు బుధవారం కుప్పకూలాయి. అమెరికా క్రెడిట్ రేటింగ్‌ను ఫిచ్ తగ్గించింది. అలాగే రాబోయే మూడేళ్లలో అమెరికా ఆర్థిక వ్యవస్థ మళ్లీ పతనమయ్యే ఛాన్స్ ఉందని సంకేతాలిచ్చింది. దాంతో ఆ ప్రభావం ఆసియా మార్కెట్లతో పాటు భారత మార్కెట్లపై పడింది. మదుపరుల సెంటిమెంట్ దెబ్బతినడంతో సూచీలు భారీగా పతనమయ్యాయి. ఇవాళ ఉదయం నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 289 పాయింట్లు తగ్గి 66,170 వద్ద, నిఫ్టీ 87 పాయింట్ల పతనమై రూ.19,646 పాయింట్ల వద్ద ట్రేడింగ్ మొదలైంది. ఆ తర్వాత ఏ దశలోనూ సూచీలు కోలుకోలేదు. మధ్యాహ్నం 2.30 గంటల వరకు సెన్సెక్స్ 999.12 పాయింట్ల వరకు నష్టపోయింది.
నిఫ్టీ 19,429.55 కనిష్ఠాన్ని తాకింది. ఆ తర్వాత స్వల్పంగా కోలుకున్నాయి. చివరకు సెన్సెక్స్ 676.53 పాయింట్లు తగ్గి 65,787.72, నిఫ్టీ 207 పాయింట్లు క్షీణించి 19,550 పాయింట్ల స్థిరపడ్డాయి. ట్రేడింగ్‌లో దాదాపు 1,232 షేర్లు పురోగమించగా.. 2,265 షేర్లు పతనమయ్యాయి. మరో 132 షేర్లు మారలేదు. నిఫ్టీలో హీరో మోటోకార్ప్, టాటా మోటార్స్, టాటా స్టీల్, ఎన్టీపీసీ, బజాజ్ ఫిన్సర్వ్ అత్యధికంగా నష్టపోయాయి. దివీస్ ల్యాబ్స్, నెస్లే ఇండియా, హెచ్‌యూఎల్, టెక్ మహీంద్రా, ఏషియన్ పెయింట్స్ లాభపడ్డాయి. క్యాపిటల్ గూడ్స్, పీఎస్‌యూ బ్యాంక్, పవర్, మెటల్ 2శాతం చొప్పున క్షీణించాయి. ఆటో, బ్యాంక్, రియాల్టీ, ఆయిల్, గ్యాస్ ఒక్కోశాతం చొప్పున క్షీణించడంతో అన్ని రంగాల సూచీలు నష్టాల్లో ముగిశాయి. బీఎస్ఈ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు ఒకశాతం శాతం చొప్పున క్షీణించాయి.