Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లలో వరుసగా నాలుగో రోజు ర్యాలీ కొనసాగింది. ఆర్బీఐ ద్రవ్య విధాన కమిటీ నిర్ణయం తర్వాత మార్కెట్లు పుంజుకున్నాయి. సీఆర్ఆర్ తగ్గింపు తదితర నిర్ణయాలు మార్కెట్లో పెట్టుబడిదారులను ఆకర్షించాయి. ఈ క్రమంలో వారంలోని తొలిరోజైన సోమవారం సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లో ముగిశాయి. క్రితం సెషన్‌తో పోలిస్తే 30-షేర్ల బీఎస్ఈ సెన్సెక్స్ 82,574.55 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 82,369.24 పాయింట్ల కనిష్టాన్ని తాకిన సెన్సెక్స్.. అత్యధికంగా 82,669.00 పాయింట్లకు పెరిగింది. చివరకు 256.22 పాయింట్లు పెరిగి 82,445.21 పాయింట్ల వద్ద ముగిసింది.
నిఫ్టీ 100.15 పాయింట్లు పెరిగి.. 25,103.20 పాయింట్ల వద్ద ముగిసింది. ట్రేడింగ్‌లో దాదాపు 2,667 షేర్లు లాభపడగా.. 1,374 షేర్లు పనతమయ్యాయి. రియల్టీ మినహా అన్ని ఇతర రంగాల సూచీలు ఐటీ, ఆయిల్ అండ్ గ్యాస్, పవర్, పీఎస్‌యూ బ్యాంక్ ఒక్కొక్కటి ఒకశాతం వరకు పెరిగాయి. బీఎస్ఈ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు ఒక్కొక్కటి ఒకశాతం వరకు జంప్ చేశాయి. బజాజ్ ఫైనాన్స్, కోటక్ మహీంద్రా బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, జియో ఫైనాన్షియల్, ట్రెంట్ నిఫ్టీలో ప్రధాన లాభాలను ఆర్జించగా, ఐసీఐసీఐ బ్యాంక్, టైటాన్ కంపెనీ, ఎం అండ్ ఎం, అదానీ పోర్ట్స్, ఎటర్నల్ నష్టపోయాయి.
Read Also : Suzuki Motor | రేర్ ఎర్త్స్ ఎగుమతులపై చైనా ఆంక్షలు.. స్విఫ్ట్ కార్ల ఉత్పత్తిని నిలిపివేసిన సుజుకీ..!
బీఎస్ఈ-లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ మునుపటి సెషన్లో రూ.451.13 లక్షల కోట్ల నుంచి రూ.455.11 లక్షల కోట్లకు పెరగడంతో పెట్టుబడిదారుల సంపద రూ.3.9 లక్షల కోట్ల లక్షల కోట్లకు పెరిగింది. నిఫ్టీ బ్యాంక్ ఇండెక్స్ రికార్డు స్థాయిలో కొనసాగింది. ఇండెక్స్ 57,049.50కి చేరుకుని 0.5 శాతం లాభపడింది. గోద్రేజ్ ఇండస్ట్రీస్, మణప్పురం ఫైనాన్స్, ఎంసీఎక్స్ ఇండియా, హ్యుందాయ్ మోటార్, ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, ముత్తూట్ ఫైనాన్స్, లారస్ ల్యాబ్స్, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, నువామా వెల్త్, హెచ్డీఎఫ్సీ ఏఎంసీ, బజాజ్ ఫైనాన్స్, ఆస్ట్రాజెనెకా ఫార్మా, ఎస్బీఐ కార్డ్స్, సిటీ యూనియన్ బ్యాంక్, నిప్పాన్ లైఫ్, ఎల్టీ ఫైనాన్స్, అనుపమ్ రసాయనన్, ఫోర్టిస్ హెల్త్‌కేర్, ఎస్ఆర్ఎఫ్ సహా 170 కంటే ఎక్కువ స్టాక్స్ బీఎస్ఈలో 52 వారాల గరిష్టాన్ని తాకాయి.