Suzuki Motor | జపాన్‌కు చెందిన ప్రముఖ ఆటో మొబైల్ కంపెనీ సుజుకీ మోటార్స్ కీలక నిర్ణయం తీసుకున్నది. కంపెనీకి చెందిన పాపులర్ మోడల్ కార్ స్విఫ్ట్ ఉత్పత్తిని తాత్కాలికంగా నిలిపివేసింది. చైనా సర్కారు రేర్ ఎర్త్ పదార్థాల ఎగుమతులపై ఆంక్షలు విధించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఆంక్షల కారణంగా విడిభాగాలు లభించకపోవడంతో ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలుస్తున్నది. చైనా రేర్ ఎర్త్స్ ఎగుమతులపై ఆంక్షలు అమలు చేయడం వల్ల ప్రభావితమైన తొలి ఆటోమొబైల్ కంపెనీ సుజుకీ. స్విఫ్ట్ సబ్‌కాంపాక్ట్ మోడల్ (స్విఫ్ట్ స్పోర్ట్ మినహా) ఉత్పత్తిని మే 26 నుంచి జూన్ 6 వరకు నిలిపివేస్తున్నట్లు కంపెనీ గతంలోనే ప్రకటించింది. విడిభాగాల కొరత కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అప్పట్లో తెలిపింది.
అయితే, కొరతకు దారితీసిన కారణాలపై మాత్రం స్పందించలేదు. ఉత్పత్తి నిలిపివేతకు సంబంధించిన కారణాలపై స్పందించేందుకు కంపెనీ ప్రతినిధి నిరాకరించినట్లు సమాచారం. ఈ వ్యవహారంపై అంతర్జాతీయ మీడియా సంస్థ కథనం ప్రచురించింది. ఏప్రిల్ నెలలో చైనా ప్రభుత్వం అనేక రకాల రేర్ ఎర్త్ పదార్థాలు, వాటితో ముడిపడిన అయస్కాంతాల ఎగుమతులను నిలిపివేసింది. దాంతో ప్రపంచవ్యాప్తంగా ఆటోమొబైల్ తయారీ సంస్థలు, ఏరోస్పేస్ కంపెనీలు, సెమీకండక్టర్ల తయారీదారులు, సైనిక కాంట్రాక్టర్ల సరఫరా వ్యవస్థలపై చైనా నిర్ణయం తీవ్ర ప్రభావం పడుతున్నది. రేర్ ఎర్త్ పదార్థాలు అనేక కీలకమైన ఎలక్ట్రానిక్, మాగ్నెటిక్ భాగాల తయారీలో వినియోగిస్తారు. చైనా ఆంక్షలతో కొన్ని యూరోపియన్ ఆటో విడిభాగాల తయారీ ప్లాంట్లు సైతం ఇప్పటికే ఉత్పత్తులను నిలిపివేశారు. ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ సైతం రేర్ ఎర్త్స్ కొరతను ఎదుర్కొనేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నది.