WhatsApp | ఇన్స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ వాట్సాప్‌కు ప్రపంచవ్యాప్తంగా దాదాపు మూడు బిలియన్ల యూజర్లు ఉన్నారు. ఆయా యూజర్లను దృష్టిలో పెట్టుకొని మెటా యాజమాన్యంలోని కంపెనీ ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్స్‌ను పరిచయం చేస్తూ వస్తున్నది. తాజాగా యూజర్లకు మరో గుడ్‌న్యూస్ చెప్పింది. వాట్సాప్‌లో ఫొటోలు-వీడియోల ఆటో డౌన్లోడ్ క్వాలిటీ విషయంలో మరింత కంట్రోల్‌ను యూజర్లకే ఇవ్వబోతున్నది. వాట్సాప్ ట్రాకర్ WABetaInfo నివేదిక ప్రకారం.. ఈ కొత్త ఫీచర్ ఆండ్రాయిడ్ వెర్షన్ 2.25.18.11 వాట్సాప్ బీటాలో కనిపించింది.
Read Also : WhatsApp | వాట్సాప్ యూజర్లకు గుడ్‌న్యూస్.. త్వరలో అందుబాటులోకి సూపర్ ఫీచర్..!
ఈ కొత్త ఫీచర్‌తో యూజర్లు తమ ఫోన్లో ఆటోమేటిక్ డౌన్లోడ్ అయ్యే మీడియా ఫైల్స్ (ఫొటోలు-వీడియోలు) క్వాలిటీని ఎంచుకునేందుకు అవకాశం ఉంటుంది. సెట్టింగ్స్‌కు వెళ్లి మీడియా ఫైల్‌ను స్టాండర్డ్ క్వాలిటీ.. లేదంటే హెచ్డీ క్వాలిటీలో డౌన్లోడ్ చేసుకోవచ్చు.. లేకపోతే ఆఫ్ చేసుకునే సౌలభ్యం యూజర్ల చేతుల్లోనే ఉండనున్నది. ఇప్పటి వరకు వాట్సాప్‌లో ఇలాంటి అవకాశం లేదు. ఈ ఆప్షన్ కోసం సెట్టింగ్స్‌లోకి వెళ్లాలి. ఆ తర్వాత స్టోరేజ్ అండ్ డేటాలోకి వెళ్లి ఆటో డౌన్లోడ్ క్వాలిటీని సెట్ చేసుకోవాలి.
స్టాండర్డ్ అండ్ హెచ్డీ ఆప్షన్స్ కనిపిస్తాయి. ఇందులో మీకు కావాల్సిన ఆప్షన్‌ను ఎంచుకోవాలి. స్టాండర్డ్ క్వాలిటీని ఎంపిక చేసుకుంటే ఎవరైనా మీకు పంపే ఫొటోలు, వీడియోల క్వాలిటీ తగ్గుతుంది. తద్వారా డేటాతో పాటు మొబైల్లో స్టోరేజ్ తక్కువగా ఉన్న సరిపోతుంది. హెచ్డీ ఆప్షన్‌ను ఎంపిక చేసుకుంటే డేటా వినియోగం పెరుగుతుంది. అదే సమయంలో మొబైల్లో ఎక్కువ స్టోరేజ్ ఆక్రమిస్తుంది. ఈ సెట్టింగ్స్‌ను స్టాండర్డ్‌గా సెట్ చేసిన సమయంలో వాట్సాప్ మీడియా ఫైల్స్‌ను డిఫాల్ట్‌గా డౌన్లోడ్ చేస్తుంది. అయితే, యూజర్లు అదే ఫైల్ హెచ్డీ వెర్షన్ యాప్‌లో వీక్షించి మాన్యువల్‌గా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
Read Also : 16 నుంచి ఆర్ఎఫ్సీఎల్లో యూరియా ఉత్పత్తి ?
ఈ ఫీచర్ వాట్సాప్ ఇటీవలి డ్యూయల్ అప్లోడ్ ఫీచర్ ఆధారంగా తీసుకువచ్చింది. ఇందులో పంపిన వారు ఫొటో, వీడియోను పంపిన సమయంలో రెండు లక్షణాలు (స్టాండర్డ్, హెచ్డీ) సర్వర్‌కు అప్లోడ్ చేయబడుతాయి. కానీ రిసీవర్ తన సెట్టింగ్‌లలో యూజర్ ఎంచుకున్న క్వాలిటీ మేరకు డౌన్లోడ్ చేసుకుంటాడు. ప్రస్తుతం ఈ ఫీచర్ గూగుల్ ప్లే బీటా ప్రోగ్రామ్ కింద నమోదు చేసుకున్న కొంతమంది బీటా టెస్టర్లకు మాత్రమే అందుబాటులో ఉన్నది. రాబోయే రోజుల్లో ఈ ఫీచర్ యూజర్లు అందరికీ అందుబాటులోకి రానున్నది. మెటా ఏప్రిల్‌లో iOS వెర్షన్ కోసం ఇలాంటి ఫీచర్‌నే ప్రారంభించింది. కానీ, ఇప్పటివరకు యూజర్లందరికీ అందుబాటులోకి రాలేదు.