ఫర్టిలైజర్సిటీ, జూన్ 7: పెద్దపల్లి జిల్లా రామగుండం కర్మాగారంలో యూరియా ఉత్పత్తిని ఈ నెల 16న ప్రారంభించడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. ప్రతి మేలో వార్షిక మరమ్మతుల్లో భాగంగా ఆర్ఎఫ్సీఎల్ షట్డౌన్ చేస్తారు. మళ్లీ జూన్లో తెరుస్తారు. అయితే ఈ నెల 8నే మరమ్మతులు పూర్తిచేయాల్సి ఉండగా, యూరియా తయారీలో కీలకమైన క్యాటలిస్ట్ కెమికల్ రాక జాప్యం జరిగింది. దీంతో 8 రోజులు ఆలస్యంగా ఉత్పత్తి ప్రారంభించనున్నారు.
ఢిల్లీ నుంచి వచ్చిన నిపుణులు యుద్ధప్రాతిపదికన ఆర్ఎఫ్సీఎల్ను ఉత్పత్తి దశలోకి తేవడానికి చర్యలు ప్రారంభించారు. 11న ఆర్ఎఫ్సీఎల్ను లైటాఫ్ చేస్తే 16వ తేదీ నాటికి ఉత్పత్తి దశలోకి వచ్చే అవకాశం ఉంది. ఏటా వానకాలం సీజన్లో తెలంగాణకు 9.5 లక్షల టన్నుల యూరియా అవసరం ఉండగా, ఆర్ఎఫ్సీఎల్ 3.5 లక్షల టన్నుల యూరియా సరఫరా చేస్తున్నది.
రోజుకు 2,200 మెట్రిక్ టన్నుల అమ్మోనియా, 3,850 మెట్రిక్ టన్నుల యూరియా ఉత్పత్తి జరుగుతుంది. ఈ ఏడాది 12.7 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఉత్పత్తి లక్ష్యంగా నిర్ణయించారు. ఇప్పటి వరకు ఆర్ఎఫ్సీఎల్లో 0.24 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఉత్పత్తి జరిగింది.