Stock Market | దేశీయ బెంచ్ మార్క్ సూచీలు గురువారం అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న బలహీనమైన సంకేతాల కారణంగా సూచీలు ఆరోరోజు నష్టాల్లో ముగిశాయి. ఇవాళ ఉదయం నష్టాలతో మొదలైన సూచీలు.. ఏమాత్రం కోలుకోలేదు. ఉదయం సెన్సెక్ 63,774.16 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. ఇంట్రాడేలో 63,902.98 పాయింట్ల కనిష్ఠానికి చేరింది. చివరకు 900.91 పాయింట్లు పతనమై 63,148.15 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 264.91 పాయింట్లు తగ్గి 18,857.25 పాయింట్ల వద్ద స్థిరపడింది. ట్రేడింగ్‌లో ఎంఅండ్ఎం, పేటీఎం షేర్లు ఒక్కొక్కటి నాలుగుశాతం క్షీణించాయి.
మార్కెట్లో బ్యాంకింగ్, ఫైనాన్షియల్, ఆటో, మెటల్ రంగాల షేర్లలో గరిష్ఠంగా అమ్మకాలు కనిపించాయి. ఇవాళ ట్రేడింగ్‌లో దాదాపు 1211 షేర్లు పురోగమించగా.. 1943 షేర్లు క్షీణించాయి. 101 షేర్లు మారలేదు. నిఫ్టీలో అత్యధికంగా నష్టపోయిన వాటిలో ఎంఅండ్ఎం, బజాజ్ ఫైనాన్స్, ఏషియన్ పెయింట్స్, యూపీఎల్, బజాజ్ ఫిన్సర్వ్ ఉన్నాయి. అయితే, యాక్సిస్ బ్యాంక్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, అదానీ పోర్ట్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఐటీసీ లాభపడ్డాయి. బీఎస్ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ ఒక శాతం, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.3 శాతం క్షీణించాయి.
పవర్ మినహా మిగిలిన అన్ని రంగాల సూచీలు నష్టాల్లో ట్రేడయ్యాయి. అంతకుముందు బుధవారం సెన్సెక్స్ 522 పాయింట్లు నష్టపోయి 64,049 వద్ద ముగిసింది. అయితే, అనేక కారణాలతో స్టాక్ మార్కెట్లు అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయని నిపుణులు పేర్కొంటున్నారు. హమాస్-ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న వివాదం సైతం మార్కెట్‌పై ప్రతికూల ప్రభావం చూపింది. అమెరికన్ బాండ్ రాబడుల పెరుగుదల పెరిగింది. దీంతో మార్కెట్ సెంటిమెంట్ దెబ్బతిన్నది. ఇదే సమయంలో డాలర్ ఇండెక్స్ బలపడి 106.5ను దాటింది. దీంతో భారత మార్కెట్లో ఎఫ్ఐఐలు భారీగా అమ్ముడయ్యాయి. దీంతో ఒత్తిడి స్టాక్స్‌పై కనిపించింది.