Pawan Kalyan | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఎక్కడికి వెళ్లినా అభిమానుల సందడి తారాస్థాయిలో ఉంటుంది. కొన్నిసార్లు ఆ అభిమానుల ఉత్సాహాన్ని అదుపులో పెట్టేందుకు పోలీసులు లాఠీలు కూడా ప్రయోగించిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి ఒక ఘటనలో తాను కూడా లాఠీ దెబ్బలు తిన్నానని యంగ్ హీరో సంతోష్ శోభన్ తాజాగా వెల్లడించాడు. సంతోష్ శోభన్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘కపుల్ ఫ్రెండ్లీ’ వాలెంటైన్స్ డే సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆయన ఈ ఆసక్తికర సంఘటనను గుర్తుచేసుకున్నారు.
పవన్ కళ్యాణ్‌ను ప్రత్యక్షంగా ఎక్కువసార్లు చూడలేదని, అయితే ఒకసారి ‘అత్తారింటికి దారేది’ సినిమా షూటింగ్ సమయంలో ఆయనను చూసేందుకు వెళ్లిన అనుభవాన్ని పంచుకున్నారు. సంతోష్ శోభన్ మాట్లాడుతూ.. “ఆ సమయంలో పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ చాలా ఎక్కువగా ఉండేది. షూటింగ్ అవుట్‌డోర్‌లో జరగడంతో భారీ సంఖ్యలో అభిమానులు అక్కడికి చేరుకున్నారు. పరిస్థితి అదుపు తప్పుతుందని భావించిన పోలీసులు జనాన్ని నియంత్రించేందుకు ప్రయత్నించారు. ఆ క్రమంలో తోపులాటలు జరిగాయి. పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. అప్పుడు అక్కడున్న అభిమానులతో పాటు నాకు కూడా లాఠీ దెబ్బలు పడ్డాయి” అని తెలిపారు.
ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పవన్ కళ్యాణ్ అభిమానుల ఉత్సాహం ఏ స్థాయిలో ఉంటుందో ఈ సంఘటన ద్వారా అర్థమవుతుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు సంతోష్ శోభన్ నటించిన ‘కపుల్ ఫ్రెండ్లీ’ సినిమా రిలీజ్‌కు ముందు ఈ వ్యాఖ్యలు చిత్రంపై మరింత ఆసక్తిని పెంచుతున్నాయి. ఇక పవన్ కళ్యాణ్ ఒకవైపు రాజకీయాలతో బిజీగా ఉంటూనే మరోవైపు సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రంతో బిజీగా ఉన్న పవన్ త్వరలో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మూవీ చేయనున్నాడు.