Stocks | దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో రోజు శుక్రవారం ప్రారంభ నష్టాలను అధగమించి లాభాలతో ముగిశాయి. బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ 182 పాయింట్ల లబ్దితో 76,993 పాయింట్లు, ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ 67 పాయింట్లు పుంజుకుని 23,466 పాయింట్ల వద్ద స్థిర పడింది. ఎన్ఎస్ఈ-50 ఇండెక్స్ ఇంట్రాడే ట్రేడింగ్లో 23,490.40 పాయింట్ల జీవిత కాల గరిష్టాన్ని తాకింది. బీఎస్ఈలో మహీంద్రా అండ్ మహీంద్రా, టైటాన్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా మోటార్స్, జేఎస్డబ్ల్యూ స్టీల్, బజాజ్ ఫైనాన్స్, యాక్సిస్ బ్యాంక్, ఆల్ట్రాటెక్ సిమెంట్ భారీగా లబ్ధి పొందాయి. ఐటీ మినహా అన్ని రంగాల షేర్లు మెరుగు పడ్డాయి. ఆటో, టెలికం, రియాల్టీ, మెటల్, హెల్త్ కేర్ సూచీలు 0.5 నుంచి ఒక శాతం మధ్య పెరిగాయి.
బీఎస్ఈ మిడ్ క్యాప్ ఇంట్రాడే ట్రేడింగ్ లో 46,041.73 పాయింట్లు (ఒక శాతానికి పైగా), బీఎస్ఈ స్మాల్ క్యాప్ 51,259.06 పాయింట్లతో (ఒక శాతానికి పైగా) లాభాలతో ముగిశాయి. నిఫ్టీ ఆటో ఇండెక్స్ 1.3 శాతం, నిఫ్టీ రియాల్టీ 0.8 శాతం, నిఫ్టీ మెటల్ 0.7 శాతం లాభాలతో స్థిర పడ్డాయి. ఫారెక్స్ మార్కెట్ లో అమెరికా డాలర్ పై రూపాయి మారకం విలువ రూ.83.56 వద్ద ట్రేడవుతున్నది.