Stock Market : భారత స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాల్లో ముగిశాయి. ఉదయం ట్రేడింగ్ నష్టాల్లో ప్రారంభమైనప్పటికీ, మధ్యాహ్నం నుంచి లాభాలబాటపట్టాయి. ట్రేడింగ్ ముగిసేసరికి సెన్సెక్స్ 787 పాయింట్ల లాభంతో ముగిసింది. ఉదయం సెన్సెక్స్ 73,477.53 పాయింట్ల వద్ద స్వల్ప నష్టంతో ప్రారంభమైంది. ఇంట్రాడేలో మరింత నష్టపోయి 72,728.66 పాయింట్ల కనిష్ట స్థాయికి చేరింది.
ఇదే సమయంలో ఇరాన్-అమెరికా మధ్య కాల్పులు విరమణ అంశంలో ప్రకటన వెలువడటం మార్కెట్ వర్గాలకు కలిసొచ్చింది. మార్కెట్ లాభాలబాట పట్టింది. ఒక దశలో సెన్సెక్స్ 74,207.46 పాయింట్ల గరిష్టాన్ని తాకింది. చివరకు 787.30 పాయింట్ల (1.07 శాతం) లాభంతో 74,106.85 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 255.15 పాయింట్ల (1.12 శాతం) లాభంతో 22,968.25 పాయింట్ల వద్ద ముగిసింది. లాభాల కారణంగా ఇన్వెస్టర్ల సందప ఒక్క రోజే ఏకంగా రూ.5 లక్షల కోట్లు పెరిగింది. దీంతో భారతీయ మార్కెట్ల విలువ రూ.427 లక్షల కోట్లకు చేరుకుంది. ఈ రోజు కన్య్సూమర్, పీఎస్‌యూ బ్యాంక్, రియాల్టీ షేర్లు దూసుకెళ్లగా, ఆయిల్ అండ్ గ్యాస్ ఇండెక్స్ షేర్లు మాత్రం భారీగా నష్టపోయాయి. ఇక, డాలర్‌తో రూపాయి మారకం విలువ స్వల్పంగా బలపడి 93.05గా ఉంది.
అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ క్రూడాయిల్ ధర 108 డాలర్లకు చేరింది. అలాగే, బంగారం ఔన్స్ 4689 డాలర్ల వద్ద కొనసాగుతోంది. ఈ రోజు సెన్సెక్స్ 30 సూచీలో ట్రెంట్, యాక్సిస్ బ్యాంక్, ఎల్అండ్ టీ, అల్ట్రా టెక్ సిమెంట్, టైటాన్ సంస్థలు లాభాల్లో ముగిశాయి. మార్కెట్ పుంజుకోవడానికి ప్రధాన కారణం.. ఇరాన్, అమెరికా మధ్య కాల్పుల విరమణ ప్రతిపాదనలో ముందడుగు పడటమే. ఇరు దేశాలకు చెందిన ప్రతిపాదనలు రెండు వైపులా చేరాయి. ఈ పరిణామంతో క్రూడాయిల్ ధర తగ్గింది. రూపాయి విలువ బలపడింది.