Stock Market : భారత స్టాక్ మార్కెట్ మంగళవారం నష్టాల్లో ముగిసింది. ట్రేడింగ్ ముగిసే సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 114.19 పాయింట్ల నష్టంతో 75,200.85 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 75,746.27 పాయింట్ల గరిష్టాన్ని తాకినప్పటికీ.. మధ్యాహ్నం నుంచి పతనమైంది. చివరికి స్వల్ప నష్టాల్లో ముగిసింది. ఇక ఎన్ఎస్ఈ నిఫ్టీ కూడా 31.95 పాయింట్ల నష్టంతో 23,618 వద్ద ముగిసింది.
సెన్సెక్స్ 30 సూచీలో భారతీ ఎయిర్టెల్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ట్రైటాన్, అల్ట్రాటెక్ సిమెంట్, ఎల్ అండ్ టీ, బజాజ్ ఫిన్సర్వ్, సన్ ఫార్మా షేర్లు నష్టాలు చవిచూశాయి. టీసీఎస్, ఎటర్నల్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ సంస్థలు లాభాలు పొందాయి. ఉదయం ట్రేడింగ్ లాభాల్లో ప్రారంభమైనప్పటికీ.. మధ్యాహ్నం నుంచి నష్టాల్లో కొనసాగాయి. ఇరాన్‌తో అణు ఒప్పందం కుదుర్చుకుంటామని ట్రంప్ వెల్లడించడం మార్కెట్ వర్గాలకు కాస్త ఉపశమనం కలిగించింది. మరోవైపు ఈ రోజు అంతర్జాతీయంగా చమురు ధర 2 శాతానికిపైగా, 2 డాలర్ల వరకు తగ్గింది. బ్యారెల్ క్రూడాయిల్ ధర 109 డాలర్ల నుంచి 107 డాలర్లకు పడిపోయింది.
అయితే, ఈ ధర సాధారణం కంటే చాలా ఎక్కువ. మరోవైపు డాలర్‌తో రూపాయి విలువ పతనం కొనసాగుతోంది. ఒక దశలో డాలర్‌తో 96.61 వద్ద ఆల్‌టైమ్ కనిష్ట స్థాయికి పడిపోయిన రూపాయి.. తర్వాత కాస్త కోలుకుని 96.52 వద్ద ముగిసింది. అంతర్జాతీయంగా బంగారం ఔన్స్ ధర 4540 డాలర్ల వద్ద కొనసాగుతోంది.