Stock Market : భారతీయ స్టాక్ మార్కెట్లు గురువారం స్వల్ప లాభాల్లో ముగిశాయి. ఉదయం నష్టాల్లో ప్రారంభమైన మార్కెట్లు క్లోజింగ్ సమయానికి కాస్త పుంజుకుని, స్వల్ప లాభాలతో ముగిశాయి. ఉదయం ఒక దశలో ఏకంగా రూ.10 లక్షల కోట్లు మార్కెట్ నష్టపోయింది. ఇరాన్‌కు ట్రంప్ చేసిన హెచ్చరికలు మార్కెట్‌పై ప్రతికూల ప్రభావం చూపాయి. సెన్సెక్స్ ఉదయం 72,262.05 పాయింట్ల వద్ద భారీ నష్టంతో ప్రారంభమైంది.
అంతకుముందు రోజు మార్కెట్ 73,134.32 వద్ద ముగిసింది. అంటే దాదాపు 900 పాయింట్ల నష్టంతో గురువారం ట్రేడింగ్ మొదలైంది. ఇంట్రాడేలో ఇంకా నష్టపోయి ఏకంగా 71,545.81 స్థాయికి పడిపోయింది. ఆ తర్వాత నెమ్మదిగా కోలుకున్న సెన్సెక్స్ ట్రేడింగ్ ముగిసే సమయానికి 185.23 పాయింట్ల (0.25 శాతం) లాభంతో 73,319 వద్ద ముగిసింది. నిఫ్టీ 50 కూడా ఒక దశలో 496 పాయింట్లు నష్టపోయింది. తర్వాత 33.70 పాయింట్లు (0.15 శాతం) కోలుకుని 22,713 వద్ద ముగిసింది. ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్, యుద్ధం ముగియడానికి రెండు వారాలు సమయం పడుతుందని ప్రకటన చేయడంతో మార్కెట్లో అనిశ్చితి నెలకొంది. దీంతో ఇన్వెస్టర్లు అమ్మకాలకు పాల్పడ్డారు. ఆర్బీఐ తాజా రూల్స్ నేపథ్యంలో బ్యాంకింగ్ షేర్లు ఒత్తిడికి గురయ్యాయి. ఈ కారణాలన్నింటి వల్ల మార్కెట్ నష్టాలకు గురైంది.
హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ, యాక్సిస్, ఎస్బీఐ బ్యాంకులు, లార్సెన్ అండ్ టర్బో, అదానీ పోర్ట్స్, సన్ ఫార్మా వంటి సంస్థలు భారీగా నష్టపోయాయి. మరోవైపు రూపాయి విలువ బలపడింది. డాలర్‌తో మారకం విలువ 157 పైసలు కోలుకుని 93.13 వద్ద కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ క్రూడాయిల్ ధర 108 డాలర్లకు చేరింది. అలాగే, ఔన్స్ బంగారం ధర 4616 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.