Stock Market | భారత స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాల్లో ముగిసింది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించనుందనే అంచనాలున్నాయి. ఐటీ స్టాక్స్‌లో భారీ కొనుగోళ్లు జరిగాయి. దాంతో మార్కెట్లు వారంలో తొలిరోజు లాభపడ్డాయి. క్రితం సెషన్‌తో పోలిస్తే సెన్సెక్స్ 81,501.06 వద్ద లాభాల్లో మొదలైంది. ఇంట్రాడేలో 81,364.86 పాయింట్ల కనిష్టాన్ని చేరిన సెన్సెక్స్.. అత్యధికంగా 81,799.06 పాయింట్ల గరిష్టానికి పెరిగింది. చివరకు 329.05 పాయింట్లు పెరిగి.. 81,635.91 వద్ద స్థిరపడింది. నిఫ్టీ సైతం 97.65 పాయింట్లు పెరిగి 24,967.75 వద్ద ముగిసింది. ఇన్ఫోసిస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, హెచ్‌సీఎల్ టెక్, టెక్ మహీంద్రా, టాటా మోటార్స్, సన్ ఫార్మా, మారుతి, టైటాన్ లాభపడ్డాయి.
భారత్ ఎలక్ట్రానిక్స్, ఆసియన్ పెయింట్స్, భారతి ఎయిర్టెల్, ఐసీఐసీఐ బ్యాంక్ నష్టపోయాయి. బీఎస్ఈ మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు ఫ్లాట్‌గా ముగిశాయి. రంగాల వారీగా చూస్తే.. ఐటీ ఇండెక్స్ 2.3శాతం పెరిగింది. రియాలిటీ ఇండెక్స్ 0.7శాతం వృద్ధిని నమోదు చేసింది. మెటల్ ఇండెక్స్ 0.6శాతం పెరిగాయి.
ఆసియా మార్కెట్లలో, దక్షిణ కొరియా కోస్పి, జపాన్ నిక్కీ 225 ఇండెక్స్, షాంఘై ఎస్ఎస్ఈ కాంపోజిట్ ఇండెక్స్, హాంకాంగ్ హాంగ్ సెంగ్ సానుకూల లాభాల్లో ముగిశాయి. యూరోపియన్ మార్కెట్లు నష్టాలతో ట్రేడవుతున్నాయి. శుక్రవారం యూఎస్ మార్కెట్లు బాగా పెరిగాయి. సెప్టెంబర్‌లో ఫెడ్ వడ్డీ రేటు తగ్గింపు, యూఎస్‌లో వడ్డీ రేటు తగ్గుతుందనే అంచనాలు దేశీయ మార్కెట్లో ఆశావాదం నెలకొందని జియోజిత్ ఇన్వెస్ట్మెంట్స్ లిమిటెడ్ పరిశోధనా అధిపతి వినోద్ నాయర్ పేర్కొన్నారు.