Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం లాభాల్లో ముగిశాయి. 30 షేర్ల బీఎస్ఈ సెన్సెక్స్ 314 పాయింట్లు పెరగ్గా.. నిఫ్టీ 95పాయింట్లకుపైగా పెరిగాయి. ఐటీ స్టాక్స్ రాణించడంతో పాటు ఈ నెల చివరలో యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గించనుందనే అంచనాల మధ్య ర్యాలీ కొనసాగింది. సెన్సెక్స్ 81వేల పాయింట్ల ఎగువన ముగిసింది. క్రితం సెషన్తో పోలిస్తే సెన్సెక్స్ 81,129.69 పాయింట్ల వద్ద లాభాల్లో మొదలైంది. ఇంట్రాడేలో 80,927.97 పాయింట్ల కనిష్ఠాన్ని తాకిన సెన్సెక్స్.. అత్యధికంగా 81,181.37 పాయింట్లకు పెరిగింది.
చివరకు 314.02 పాయింట్ల లాభంతో 81,101.32 వద్ద స్థిరపడింది. నిఫ్టీ సైతం 0.39 శాతం పెరిగి 24,868.60 పాయింట్ల వద్ద ముగిసింది. వరుసగా ఐదోరోజు మార్కెట్లు లాభపడ్డాయి. భారత్లో ప్రముఖ ఐటీ సేవల సంస్థ అయిన ఇన్ఫోసిస్ సెప్టెంబర్ 11న ఈక్విటీ షేర్లను తిరిగి కొనుగోలు చేసే ప్రతిపాదనను బోర్డు పరిశీలిస్తుందని చెప్పడంతో 5.03 శాతం లాభపడింది. టెక్ మహీంద్రా, అదానీ పోర్ట్స్, హెచ్సీఎల్ టెక్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, బజాజ్ ఫిన్సర్వ్ లాభాలను ఆర్జించాయి. ట్రెంట్, ఎటర్నల్, అల్ట్రాటెక్ సిమెంట్, ఎన్టీపీసీ నష్టాల్లో ముగిశాయి.