Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం నష్టాల్లో ముగిశాయ. ఐటీ, కన్స్యూమర్ డ్యూరబుల్స్ మినహా అన్ని రంగాల్లో అమ్మకాలు కనిపించాయి. దాంతో మార్కెట్లు ఒడిదుడుకులను ఎదుర్కొన్నాయి. ప్రపంచ మార్కెట్లలోని సానుకూల పవనాలతో మార్కెట్లు ఉదయం ప్లాట్‌గానే మొదలయ్యాయి. ఆ తర్వాత మార్కెట్లు లాభాల్లోకి దూసుకెళ్లాయి. ఆ తర్వాత కొద్దిసేపటికే మార్కెట్లు నష్టాల్లోకి జారుకున్నాయి. చివరికి స్వల్పంగా కోలుకోవడంతో భారీ నష్టాల నుంచి బయటపడ్డాయి. ఉదయం 81,899.51 పాయింట్ల ప్రారంభమైన సెన్సెక్స్.. ఇంట్రాడేలో 81,646.08 పాయింట్ల కనిష్టానికి చేరుకుంది. అత్యధికంగా 82,257.74 పాయింట్ల గరిష్టానికి పెరిగింది. చివరకు 153.09 పాయింట్లు తగ్గి.. 81,773.66 వద్ద ముగిసింది.
నిఫ్టీ సైతం 62.15 పాయింట్లు తగ్గి 25,046.15 వద్ద ముగిసింది. బీఎస్ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.7శాతం, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.4శాతం పతనమయ్యాయి. కన్స్యూమర్ డ్యూరబుల్స్ 0.7 శాతం, ఐటీ 1.5శాతం లాభపడ్డాయి. ఇక రియాల్టీ, టెలికాం, ఫార్మా, ఆయిల్ అండ్ గ్యాస్, మీడియా, పీఎస్‌యూ బ్యాంక్, ఆటో 0.3శాతం నుంచి 2శాతం వరకు పతనమయ్యాయి. నిఫ్టీలో టాటా మోటార్స్, అల్ట్రాటెక్ సిమెంట్, జియో ఫైనాన్షియల్, ఓఎన్జీసీ, ట్రెంట్ నష్టాల్లో ముగియగా.. టైటాన్ కంపెనీ, ఇన్ఫోసిస్, టీసీఎస్, టెక్ మహీంద్రా, మ్యాక్స్ హెల్త్‌కేర్ లాభపడ్డాయి. రూ.695.83 ఫ్లోర్ ధరతో క్యూఐపీని ప్రారంభించిన తర్వాత అనంత్ రాజ్ షేర్లు 5శాతం తగ్గాయి. రూ.707 కోట్ల విలువైన ఆర్డర్ల తర్వాత సాత్విక్ గ్రీన్ ఎనర్జీ షేర్లు 10శాతం వృద్ధి చెందింది.
క్యూవన్ లాభం 67శాతం పెరిగినప్పటికీ మంగళసూత్ర షేర్ల శ్రింగర్ హౌస్ 2శాతం పతనమయ్యాయి. అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి నీలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ షేర్ ధర 11శాతం పెరిగింది. ది కార్డ్ కంపెనీతో సహకారంతో డ్రీమ్‌ఫోక్స్ సర్వీసెస్ షేర్ ధర 5శాతం పెరిగింది. జాగ్వార్ ల్యాండ్ రోవర్ క్యూ2 హోల్‌సేల్స్ 24.2శాతం తగ్గడంతో టాటా మోటార్స్ షేర్లు 2.5శాతం పడిపోయాయి. క్యూ2లో రూ.4,570 కోట్ల ప్రీసేల్స్ ఉన్నప్పటికీ లోధా డెవలపర్స్ షేర్లు 1.5శాతం తగ్గాయి. త్రైమాసిక గణాంకాలు మెరుగ్గా ఉండడంతో టైటాన్ షేర్లు 4శాతం పెరగ్గా.. బార్వాహా ప్లాంట్‌లో తయారీ ప్రారంభించడంతో అసోసియేటెడ్ ఆల్కహాల్, బ్రూవరీస్ షేర్లు దాదాపు 3శాతం వృద్ధిని నమోదు చేశాయి. ఆస్టర్ డీఎం హెల్త్‌కేర్, ఆర్బీఎల్ బ్యాంక్, ఎంఆర్ఎఫ్, హీరో మోటోకార్ప్, కెనరా బ్యాంక్, గాబ్రియేల్ ఇండియా, యాత్ర ఆన్లైన్, అథర్ ఎనర్జీ, టైమెక్స్ గ్రూప్, ఇంద్రప్రస్థ మెడికల్, నెట్వెబ్, ఐనాక్స్ గ్రీన్, జీఆర్ఎం ఓవర్సీస్, వీ2 రిటైల్ వంటి 120 కంటే ఎక్కువ స్టాక్‌లు బీఎస్ఈలో 52 వారాల గరిష్ట స్థాయికి చేరుకున్నాయి.