Stock Market : భారతీయ స్టాక్ మార్కెట్లు బుధవారం నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 102.20 పాయింట్లు నష్టపోగా, నిఫ్టీ 37.95 పాయింట్లు నష్టపోయింది. అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు, ఆటోమొబైల్, చమురు మార్కెటింగ్ స్టాక్స్ అమ్మకాల ఒత్తిడుల మూలంగా వరుసగా మూడో రోజు కూడా స్టాక్ మార్కెట్ నష్టాల బాటపట్టింది.
బీఎస్ఈ 102.20 పాయింట్లు (0.12 శాతం) నష్టపోయి 84,961.14 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 37.95 పాయింట్లు (0.14 శాతం) నష్టపోయి 26,140.75 పాయింట్ల వద్ద ముగిసింది. నేటి సెషన్ లో మారుతి సుజుకి, టాటా మోటార్స్, పవర్ గ్రిడ్, హిందుస్తాన్ యునీలివర్, ఏసియన్ పెయింట్స్, టాటా స్టీల్ వంటి సంస్థలు నష్టపోగా.. టైటాన్, హెచ్ సీఎల్ టెక్నాలజీస్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, సన్ ఫార్మా వంటి సంస్థలు లాభాలు చవిచూశాయి.
మరోవైపు బుధవారం రూపాయి విలువ స్పల్పంగా పెరిగింది. అమెరికా డాలర్ తో 31 పైసలు పెరిగి, 89.87 వద్ద ముగిసింది. ఆర్బీఐ మద్దతు, అంతర్జాతీయంగా చమురు ధరల తగ్గుదల వంటివి రూపాయి బలపడేందుకు దారితీశాయి. 90.20 వద్ద ప్రారంభమైన రూపాయి విలువ ఒక దశలో 89.75 అత్యధిక స్థాయికి, ఆ తర్వాత 90.23 అత్యల్ప స్థాయికి చేరింది. చివరకు 89.87 వద్ద స్థిరపడింది.