Stock Markets | ముంబై, సెప్టెంబర్ 2: దేశీయ స్టాక్ మార్కెట్ల లాభాల పరంపర కొనసాగుతున్నది. వరుసగా పదోరోజు సోమవారం కూడా సూచీలు కదంతొక్కాయి. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు భారీగా పెట్టుబడులు పెడుతుండటం, అమెరికా మార్కెట్ల ర్యాలీ కొనసాగుతుండటంతో దేశీయ సూచీలు చారిత్రక గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. ఇంట్రాడేలో 350 పాయింట్లకు పైగా లాభపడి నూతన గరిష్ఠ స్థాయికి 82,725 పాయింట్లను తచ్చాడిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ మార్కెట్ ముగిసే సమయానికి 194 పాయింట్లు అందుకొని 82,559.84 పాయింట్ల వద్ద ముగిసింది.
సెప్టెంబర్ 2023 తర్వాత వరుసగా పదిరోజులుగా లాభపడటం ఇదే తొలిసారి కావడం విశేషం. మరోసూచీ నిఫ్టీ 13 రోజులుగా లాభాల్లోనే కదలాడుతున్నది. గత దశాబ్దకాలంలో తొలిసారిగా వరుసగా ఇన్ని రోజులు లాభపడటం ఇదే తొలిసారి. సోమవారం కూడా 42.80 పాయింట్లు అందుకొని చారిత్రక గరిష్ఠ స్థాయి 25,278.70 పాయింట్లకు ఎగబాకింది. గత 13 సెషన్లలో నిఫ్టీ 1,140 పాయింట్లు లేక 4.72 శాతం బలపడగా, సెన్సెక్స్ వరుస పది సెషన్లలో 2,135.16 పాయింట్లు లాభపడ్డాయి.
ఎన్సీసీకి 1,236 కోట్ల ఆర్డర్
హైదరాబాద్, సెప్టెంబర్ 2: గత నెలలో రూ.1,236 కోట్ల విలువైన ఆర్డర్లు లభించినట్లు ఎన్సీసీ లిమిటెడ్ ప్రకటించింది. వీటిలో ఇరిగేషన్ విభాగం నుంచి వచ్చినట్లు పేర్కొంది.