ముంబై, ఫిబ్రవరి 4: దేశీయ స్టాక్ మార్కెట్లు రివ్వున ఎగిశాయి. మెక్సికో, కెనడాలపై విధించిన టారిఫ్‌లను తాత్కాలికంగా వాయిదావేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ప్రకటించడంతో అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లు ఒక్కసారిగా పుంజుకున్నాయి. ఇదే క్రమంలో గత కొన్ని రోజులుగా నష్టాలు ఏరులైపారుతున్న దేశీయ మార్కెట్లు కదంతొక్కాయి. మదుపరులుగు ఎగబడి కొనుగోళ్లు జరపడంతో 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ ఇంట్రాడేలో 1,472 పాయింట్లు లేదా 2 శాతం వరకు లాభపడింది. చివరకు మార్కెట్ ముగిసే సమయానికి 1,397.07 పాయింట్లు లేదా 1.81 శాతం అందుకొని 78,584.81 పాయింట్ల వద్దముగిసింది. దీంతో సూచీలు నెల గరిష్ఠ స్థాయికి చేరుకున్నట్లు అయింది.
మరోసూచీ నిఫ్టీ సైతం 378.20 పాయింట్లు లేదా 1.62 శాతం అందుకొని 23,739.25 వద్ద ముగిసింది. జనవరి 3 తర్వాత సూచీలకు ఇదే గరిష్ఠ స్థాయి ముగింపు కావడం విశేషం. రిజర్వుబ్యాంక్ తన పరపతి సమీక్షలో వడ్డీరేట్లను తగ్గించే అవకాశాలుండటం కూడా మదుపరులను కొనుగోళ్ల వైపు నడిపించాయి. దీంతో 6 లక్షల కోట్ల మదుపరుల సంపద పెరిగింది. బీఎస్ఈలో లిైస్టెన కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ విలువ రూ.5,95,996.51 కోట్లు పెరిగి రూ.4,25,50,826.11 కోట్లు(4.88 ట్రిలియన్ డాలర్లు)కు చేరుకున్నది.
వాణిజ్య యుద్ధానికి తెరలేపిన ట్రంప్..ఇతర దేశాల నుంచి ఒత్తిడి ఎక్కువ కావడంతో రెండు దేశాలపై విధించిన టారిఫ్ విషయంలో వెనక్కి తగ్గడం సూచీల్లో జోష్ పెంచిందని మోతీలాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ హెడ్ సిద్దార్థ తెలిపారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికిగాను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సార్వత్రిక బడ్జెట్‌పై మదుపరులు వేచి చూసే దోరణి అవలంభించినప్పటికీ గ్లోబల్ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల అంశాలు సూచీలు పెరగడానికి ప్రధాన కారణం.