Stock Market : భారతీయ స్టాక్ మార్కెట్ల (Stock Markets) కు సోమవారం నాటి ట్రేడింగ్ తీవ్ర నిరాశ మిగిల్చింది. ఉదయం పూట అంతర్జాతీయ మార్కెట్ల మద్దతుతో 500 పాయింట్లకుపైగా లాభపడి సరికొత్త రికార్డుల వైపు పయనిస్తుందనుకున్న దలాల్ స్ట్రీట్.. మధ్యాహ్నం మూడు గంటల సమయానికి పూర్తిగా బేరిష్ జోన్లోకి జారుకుంది. చివరి గంటలో అమ్మకాల ఒత్తిడి ఒక్కసారిగా తీవ్రం కావడంతో మార్కెట్లు తమ లాభాలన్నింటినీ కోల్పోయి భారీ నష్టాలను చవిచూశాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి బీఎస్ఇ సెన్సెక్స్ (BSE Sensex), ఎన్ఎస్ఇ నిఫ్టీ (NSE Nifty 50) రెండు సూచీలు కూడా నష్టాల్లోనే స్థిరపడ్డాయి.
ఉదయం 23,700 మార్కును తాకిన నిఫ్టీ ముగింపు సమయానికి పతనమై 23,400 స్థాయి కంటే దిగువన ముగిసింది.సెన్సెక్స్ 500 పాయింట్ల మేర పతనమైంది. మధ్యాహ్నం 3 గంటల తర్వాత మార్కెట్ ఇంతలా కుప్పకూలడానికి ప్రధానంగా పశ్చిమాసియా పరిణామాలు కారణమయ్యాయి. అమెరికా-ఇరాన్ మధ్య శాంతి చర్చలు జరుగుతున్నాయనుకుంటున్న తరుణంలోనే, ఇరు దేశాలు పరస్పరం దాడులు చేసుకోవడం అంతర్జాతీయంగా కలకలం రేపింది. ఇరాన్ రాడార్, డ్రోన్ కేంద్రాలపై అమెరికా దాడులు చేయగా.. దానికి ప్రతిగా కువైట్‌లోని అమెరికా ఎయిర్‌బేస్‌ను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ క్షిపణి దాడులు చేసినట్లు వచ్చిన వార్తలు ఇన్వెస్టర్లను భయాందోళనలకు గురిచేశాయి.
ఈ యుద్ధ వాతావరణం కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ (ముడిచమురు) ధరలు బ్యారెల్‌కు 93 డాలర్ల మార్కును తాకడం ద్రవ్యోల్బణ భయాలను మరింత పెంచింది. దీనికి తోడు గత శుక్రవారం ఏకంగా 21,000 కోట్ల రూపాయల విలువైన షేర్లను విక్రయించిన విదేశీ పెట్టుబడిదారులు (FIIs), ఈ రోజు మధ్యాహ్నం తర్వాత కూడా లార్జ్-క్యాప్ షేర్లలో తమ అమ్మకాలను ఉధృతం చేశారు.