Telangana | హైదరాబాద్, మే 26(నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వ పరిస్థితి ముందు నుయ్యి.. వెనుక గొయ్యిలా తయారైంది. ఆఘమేఘాల మీద లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తున్నాయని గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ సర్కార్ మాటలు కోటలుదాటడం లేదు. ఈ భారీ పెట్టుబడులపై అవగాహనా ఒప్పందాల(ఎంవోయూ)ను కుదుర్చుకున్న రాష్ట్ర సర్కారు.. ఇప్పుడు వాటి కార్యరూపం దాల్చలేక నానా తంటాలు పడుతున్నది.
ప్రభుత్వ ఆదేశాలమేరకు పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులు ఆయా పెట్టుబడిదారులతో సంప్రదింపుల్లో నిమగ్నమయ్యారు. సాధ్యమైనంత తొందరలో కంపెనీలు ప్రారంభించాలని వారిపై ఒత్తిడి తెస్తున్నారు. ఏమైనా సందేహాలుంటే తమతో చెప్పాలని, ప్రభుత్వంతో మాట్లాడి వాటిని సరిచేస్తామని భరోసా ఇస్తున్నప్పటికీ ఆయా కంపెనీల్లో చలనం లేదు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నిరాశాజనకంగా ఉండటంతో ఆయా సంస్థలు ఇతర రాష్ర్టాలు ఇస్తున్న రాయితీలు, ఇతర పరిస్థితులపై ఆరా తీస్తున్నట్లు తెలిసింది. అంతేకాదు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సీఎం పదే పదే చెబుతున్న మాటలు కూడా పెట్టుబడిదారులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నట్లు పరిశ్రమవర్గాలు చెబుతున్నాయి.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రాష్ట్ర ప్రతినిధుల బృందం రెండుసార్లు దావోస్ సదస్సుకు హాజరు కావడంతోపాటు సింగపూర్, అమెరికా, లండన్, తైవాన్, జపాన్ తదితర దేశాల్లో పర్యటించి దాదాపు రెండు లక్షల కోట్ల రూపాయలకుపైగా పెట్టుబడులకు సంబంధించిన అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్న విషయం తెలిసిందే. ఏడాదిన్నరలో జరిగిన ఈ ఎంవోయూలలో కొన్ని గతంలోనే బీఆర్ఎస్ సర్కారుతో కుదుర్చుకున్న ఒప్పందాలు మళ్లీ చేసుకోగా..మరికొన్ని మాత్రం కొత్తగా చేసుకున్నాయి. అయితే ఎంవోయూ చేసుకున్న ఏ ఒక్క కంపెనీ కూడా ఇప్పటి వరకు భూములు కేటాయించాలని కానీ, పరిశ్రమకు అనుమతులు కావాలని దరఖాస్తు కూడా చేసుకోలేదు. మరోవైపు, ప్రభుత్వం సైతం ఎంవోయూలనే పెట్టుబడులుగా పెద్ద ఎత్తున ప్రచారం చేసుకొని మౌనం దాల్చింది.
అయితే, సీఎం స్థాయిలోనే వచ్చి పెట్టుబడులు కోరడంతో ఉత్సాహంగా ముందుకొచ్చి ఎంవోయూలు చేసుకున్న పలు కంపెనీలు… అనంతరం రాష్ట్రంలోని పరిస్థితులను తెలుసుకొని అవాక్కవుతున్నట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ప్రోత్సాహకాలు కల్పించే పరిస్థితి లేకపోవడం, గత ఏడాదిన్నరగా పరిశ్రమలకు దాదాపు రూ. 3, 500 కోట్లకుపైగా సబ్సిడీలు బకాయి ఉండటం తదితర అంశాలు పెట్టుబడిదారులను ఆందోళనకు గురిచేస్తున్నట్లు పేర్కొంటున్నారు.
రాష్ట్రం దివాలా తీసిందని, ఇచ్చేందుకు తమ వద్ద ఏమీ లేదని, తమకు అప్పు ఇచ్చేవారు కూడా లేరని ముఖ్యమంత్రి పదే పదే చెబుతుండటం పెట్టుబడిదారులను మరింత ఆలోచనలో పడేస్తున్నట్లు చెబుతున్నారు. పొరపాటున ఇక్కడ పెట్టుబడి పెడితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకాలు రాకపోగా, కేంద్రం నుంచి వచ్చే సబ్సిడీలు కూడా రాకుండా పోతాయని వారు భావిస్తున్నారు. దీంతో ఎంవోయులు చేసుకున్న పలు కంపెనీలు ఇతర రాష్ర్టాలవైపు చూస్తున్నట్లు ప్రభుత్వానికి సమాచారం అందింది. దీంతో ప్రభుత్వం అప్రమత్తమై వెంటనే ఆయా కంపెనీల ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరపాలని ఆదేశించినట్లు, దీంతో అధికారులు ఎలాగైనా కంపెనీలు ఏర్పాటయ్యేలా చర్యలకు శ్రీకారంచుట్టారు.
మరోవైపు, తెలంగాణ రాష్ట్రంతో కుదిరిన ఎంవోయులపై ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ర్టాలు ప్రత్యేక దృష్టి సారించినట్టు పరిశ్రమ వర్గాల ద్వారా తెలిసింది. ఇప్పటికే పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి పథంలో ఉన్న మహారాష్ట్ర, గుజరాత్ రాష్ర్టాలు తెలంగాణ రాష్ట్రం ఆఫర్ చేస్తున్న ప్రోత్సాహకాలకన్నా అధికంగా ఇస్తామని ఆయా కంపెనీలకు ఆశ చూపుతున్నట్లు సమాచారం. అంతేకాదు, తమ రాష్ర్టాల్లో పారిశ్రామిక ప్రగతికి సంబంధించిన ఎకోసిస్టం అభివృద్ధి చెందినట్లు, ఇక్కడ పరిశ్రమ ఏర్పాటు చేసుకుంటే ఎటువంటి ఇబ్బందులూ ఉండవని, త్వరితగతిన ఉత్పత్తి ప్రారంభించే ఆస్కారం ఉంటుందని వారు చెబుతున్నారని తెలిసింది.
తెలంగాణతో ఎంవోయూలు చేసుకున్న కంపెనీల్లో పదికిపైగా సంస్థలు ఏపీ, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, గుజరాత్ రాష్ర్టాలతో చర్చలు జరుపుతున్నట్లు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. కంపెనీల వివరాలు వెల్లడించేందుకు వారు నిరాకరించారు. ఎన్డీఏ పాలిత రాష్ర్టాలకు కేంద్రం నుంచి సంపూర్ణ అండదండలు ఉండడం ఆ రాష్ర్టాలకు కలిసొచ్చే అంశం కాగా, తెలంగాణ సీఎం పదే పదే రాష్ట్రం దివాలా తీసిందని చెప్పడం మనకు మైనస్‌గా మారిందని వారు వివరిస్తున్నారు. అందుకే పలు కంపెనీలు ఇతర రాష్ర్టాలవైపు మొగ్గు చూపుతున్నాయని చెబుతున్నారు.
ప్రోత్సాహకాలు, సబ్సిడీల విషయంలో కంపెనీ వర్గాలు లేవనెత్తుతున్న సందేహాలపై అధికారులు స్పష్టమైన హామీ ఇవ్వలేకపోతున్నారు. మీ సందేహాలను ప్రభుత్వంతో చర్చించి పరిష్కారమయ్యేలా చూస్తామని చెబుతున్నారే తప్ప వారిలో భరోసాను కల్పించలేక విఫలమవుతున్నారు. దీంతో కంపెనీ వర్గాలు అధికారుల ఫోన్‌కాల్స్‌ను లైట్‌గా తీసుకుంటున్నట్లు తెలిసింది. ప్రభుత్వంతో ఎంవోయూలు చేసుకున్న కంపెనీలతో చర్చించి సబ్సిడీలకు సంబంధించిన కార్యాచరణ ప్రకటించాలని, కంపెనీలకు ఏ విధమైన నష్టం జరగని రీతిలో ప్యాకేజీ ఉండాలని వారు కోరుతున్నారు. నోటిమాటతో చెప్పడం కాదని, స్పష్టత కావాలని వారు కోరుతున్నారు. కాగా, రాష్ట్ర ప్రభుత్వం సైతం ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా వారికి స్పష్టమైన హామీ ఇవ్వలేకపోతున్నదని అధికారవర్గాల్లో చర్చ జరుగుతున్నది.