హైదరాబాద్, జూలై 6 (నమస్తే తెలంగాణ): ఎలక్ట్రిక్ వాహన(ఈవీ) రంగంలో తెలంగాణ రాష్ర్టాన్ని అగ్రస్థానం లక్ష్యంగా కృషి చేస్తున్నామని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. ఈవీ రంగ అభివృద్ధికి, ప్రోత్సాహకాలకు సంబంధించి అవసరమైన సూచనలు చేస్తే అందుకు అనుగుణంగా విధాన నిర్ణయాలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.
ఈవీల తయారీ, లిథియం బ్యాటరీల తయారీ ప్లాంట్లను ఏర్పాటు చేసే సంస్థలకు ప్రభుత్వ పాలసీ ప్రకారం ప్రోత్సాహకాలు అందిస్తామన్నారు. శనివారం సచివాలయంలో గోల్డ్‌స్టోన్ ప్రసాద్ నేతృత్వంలో ఎలక్ట్రిక్ త్రిచక్ర వాహనాల సంస్థ ‘ఈటో’ ప్రతినిధులు మంత్రితో భేటీ అయ్యారు. జడ్చర్ల వద్ద ఉన్న ప్లాంట్‌లో ప్రతియేటా 10 వేల యూనిట్లు ఉత్పత్తి అవుతున్నాయని, వీటి సామర్థ్యాన్ని మరింత పెంచాలని కంపెనీ ప్రతినిధులకు శ్రీధర్ బాబు సూచించారు. అలాగే మహిళా డ్రైవర్లను ప్రోత్సహించేందుకు కంపెనీ చేపట్టిన కార్యక్రమాన్ని మంత్రి ప్రశంసించారు.