న్యూఢిల్లీ, జనవరి 14 : స్మార్ట్ఫోన్లు మరింత ప్రియంకాబోతున్నాయి. అంతర్జాతీయంగా చిప్‌ల కొరత తీవ్రం కావడంతో స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థలు మొబైల్ ధరలను పెంచడానికి సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే నూతన టెక్నాలజీ ఏఐ కోసం ప్రత్యేక దృష్టి సారించిన సంస్థలు.. అప్‌గ్రేడ్ చేయడానికి భారీగా నిధులను వెచ్చిస్తున్నారు. ఇదే క్రమంలో ఈ నూతన సేవలను అందించడానికి చిప్‌ల సామర్థ్యం కూడా పెంచుకోవాల్సి వస్తున్నదని, కానీ గ్లోబల్ మార్కెట్లో వీటి కొరత ఎక్కువగా ఉన్నదని, వీటిని అధిక మొత్తంలో నిధులు వెచ్చించి కొనుగోలు చేయాల్సి వస్తున్నదని ఒప్పో ప్రతినిధి వెల్లడించారు.
దీంతో మొబైల్ తయారీ సంస్థలపై పడుతున్న భారాన్ని తగ్గించుకోవడానికి వీటి ధరలు పెంచకతప్పదని ఆయన సంకేతాలిచ్చారు. భవిష్యత్తులో ప్రజలకు చౌకగా స్మార్ట్ఫోన్లు లభించే అవకాశాలు లేవని, విలువ-నూతన టెక్నాలజీ కలిగిన స్మార్ట్ఫోన్లు కావాలంటే అధిక మొత్తంలో నిధులు వెచ్చించాల్సి రావచ్చునని ఆయన చెప్పారు. మరోవైపు, ప్రస్తుతం మార్కెట్లో ఏఐ టెక్నాలజీతో తయారైన స్మార్ట్ఫోన్లకు గిరాకీ నెలకొన్నది. మొత్తం విక్రయాల్లో వీటి వాటా 2024లో 3 శాతంగా ఉండగా, 2025 తొలి ఆరు నెలల్లో 13 శాతానికి ఎగబాకిందని కౌంటర్‌పాయింట్ రీసర్చ్ వెల్లడించింది.