ICICI OD For Small Traders | చిన్న వ్యాపారులకు శుభవార్త. దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ బ్యాంకుల్లో ఒకటి ఐసీఐసీఐ బ్యాంక్.. చిన్న వ్యాపారుల కోసం ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ అందుబాటులోకి తీసుకొస్తున్నది. ఇందుకోసం గ్లోబల్ ఈ-కామర్స్ జెయింట్ అమెజాన్‌తో జత కట్టింది. అమెజాన్‌లో పేరు రిజిస్టర్ చేసుకున్న వ్యాపారులకు ఈ ఫెసిలిటీ లభిస్తుంది.
దీని ద్వారా వ్యాపారులు రూ.25 లక్షల వరకు ఓవర్‌డ్రాఫ్ట్ తీసుకోవచ్చు. దేశీయ బ్యాంకింగ్ రంగంలో ఖాతాదారులకు ప్రత్యేకించి చిన్న వ్యాపారులకు తొలిసారి ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ కల్పిస్తున్న బ్యాంక్ ఐసీఐసీఐ బ్యాంక్. ఈ ప్రక్రియ పూర్తిగా డిజిటలైజ్ ఫెసిలిటీగా అందుబాటులో ఉంటుంది.
ఇలా ఓడీ ఫెసిలిటీ వాడుకున్న వ్యాపారులు తాము వాడుకున్న ఓడీ మొత్తంపై వడ్డీరేటు చెల్లించాల్సి ఉంటుంది. ఆటోమెటెడ్ స్కోర్ కార్డ్ ఆధారిత వ్యవస్థ ద్వారా వ్యాపారులకు ఇన్స్టంట్ ఓడీ ఫెసిలిటీ అప్రూవ్ అవుతుంది. ఐసీఐసీఐ బ్యాంకు ఖాతాదారులు కూడా ఈ సౌకర్యాన్ని ఇన్‌స్టంట్‌గా పొందొచ్చు.
అడ్వాన్స్డ్ డేటా అనలిటిక్స్‌తో ఈ ఫెసిలిటీని డెవలప్ చేశారు. సంబంధిత వ్యాపారులు తమ బ్యాంక్ స్టేట్మెంట్, ఇన్‌కం టాక్స్ రిటర్న్స్ పత్రాలు సమర్పించి ఓడీ రూపంలో క్రెడిట్ తీసుకోవచ్చు. ఇక ఐసీఐసీఐ బ్యాంకులో కరంట్ ఖాతా గల వ్యాపారులు తక్షణం ఈ ఫెసిలిటీని వాడుకోవచ్చు. ఇప్పటి వరకు ఐసీఐసీఐ బ్యాంకులో ఖాతా లేని వారు కూడా తాజాగా ఖాతా తెరిచి ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చుకునే వెసులుబాటు లభిస్తున్నది.
కస్టమర్లు తేలిగ్గా బిజినెస్ చేయడానికి, సకాలంలో క్రెడిట్స్ పొందడానికి తమ బ్యాంకు ఎల్లవేళలా కృషి చేస్తుందని ఐసీఐసీఐ బ్యాంక్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ సెగ్మెంట్ హెడ్ పంకజ్ గాడ్జిల్ చెప్పారు.ఖాతాదారులు ఏడాదికోసారి ఈ ఓడీ ఫెసిలిటీని రెన్యూవల్ చేసుకోవాలి. అంతే కాదు ఒకసారి తీసుకున్న ఓడీ చెల్లింపులను బట్టి మరోమారు ఓడీ వాడుకునే సౌకర్యం ఉంటుంది.
మీరు బ్యాంకు వెబ్‌సైట్‌లోని సెల్లర్ సెంట్రల్ బ్యానర్ క్లిక్ చేస్తే, ఐసీఐసీఐ బ్యాంక్ ఇన్‌స్టా ఓడీ ఫెసిలిటీ పొందవచ్చు. బ్యాంకు వెబ్సైట్లో లాగిన్ అయి ఆన్లైన్లో అప్లికేషన్ పూర్తి చేయాలి. కేవైసీ పూర్తి చేశాక అప్రూవల్ లభిస్తుంది. అటుపై మీ క్రెడిట్ స్కోర్.. బ్యాంకు స్టేట్మెంట్.. ఐటీ రిటర్న్స్‌ను బట్టి ఓడీ ఫెసిలిటీ అప్రూవ్ అవుతుంది.