Singareni | హైదరాబాద్, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ): మరో ఐదు కొత్త బొగ్గు గనులను ప్రారంభించడానికి సిద్ధమైంది సింగరేణి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే ఈ ఐదు బొగ్గు గనులను ప్రారంభించడానికి అధికారులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని సింగరేణి సీఎండీ ఎన్ బలరాం ఆదేశించారు. వీటిలో కొత్తగూడెం వీకే ఓపెన్‌కాస్ట్, ఇల్లందు రొంపేడు, బెల్లంపల్లి గోలేటి, రామగుండం కోల్‌మైన్‌కు సంబంధించి పెండింగ్‌లో ఉన్న అన్ని పనులను పూర్తిచేసి, అనుమతులు కూడా సాధించాలని సూచించారు.
ఇకపై రోజుకు కనీసంగా రెండు లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి, రవాణా లక్ష్యంగా పెట్టుకొని చర్యలు వేగవంతం చేయాలని పేర్కొన్నారు. సింగరేణి భవన్లో జరిగిన సమీక్ష సమావేశంలో గనుల వారీగా ఉత్పత్తి వివరాలపై చర్చించారు.
ప్రస్తుతం రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలతో అనుకున్న లక్ష్యాన్ని సాధించలేకపోయామని పలువురు జీఎంలు సీఎండీకి వివరించారు. ఈ ఏడాది నిర్దేశించుకున్న 72 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించేందుకు అధికారులంతా ప్రణాళికబద్ధంగా పనిచేయాలని ఆయన సూచించారు.