హైదరాబాద్, ఆగస్టు 19 (నమస్తే తెలంగాణ) : కీలక మైనింగ్ రంగంలో ప్రవేశించాలని తహతహలాడుతున్న సింగరేణి సంస్థ తొలి అడుగేసింది. కర్ణాటకలో గల దేవదుర్గ్‌లోని బంగారం, రాగి గనుల అన్వేషణకు లైసెన్స్ పొందింది. కేంద్ర గనుల మంత్రిత్వశాఖ నిర్వహించిన ఆన్లైన్ వేలంలో 37.71% రాయల్టీని కోట్చేయడం ద్వారా సంస్థ ఎల్-1 బిడ్డర్‌గా నిలిచినట్టు కంపెనీ సీఎండీ ఎన్ బలరాం తెలిపారు. దీంతో క్రిటికల్ మైనింగ్ రంగంలో ఖనిజాన్వేషణకు శ్రీకారంచుట్టినట్టు అయిందన్నారు.
రానున్న ఐదేండ్లల్లో ఈ రెండు గనుల్లో అన్వేషణను పూర్తి చేసి, అనంతరం నివేదికను కేంద్రానికి సమర్పిస్తామని చెప్పారు. ఇందుకోసం రూ. 90 కోట్ల వ్యయం అవుతుండగా, దీంట్లో రూ.20 కోట్లు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ రూపంలో చెల్లిస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సింగరేణి సంస్థను అభినందించారు.