Stock Market | ముంబై, అక్టోబర్ 3: దేశీయ స్టాక్ మార్కెట్లకు మిడిల్ఈస్ట్ దెబ్బ గట్టిగా తగిలింది. ఇజ్రాయెల్‌పై ఇరాన్ క్షిపణుల దాడి మదుపరులను భయాందోళనలకు గురిచేసింది. అసలే సూచీలు ఆల్‌టైమ్ హైకి చేరిన దగ్గర్నుంచి లాభాల స్వీకరణ దిశగా అడుగులు వేస్తున్న ఇన్వెస్టర్లను ప్రస్తుతం పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ మేఘాలు మరింతగా ప్రభావితం చేశాయి. ఈ క్రమంలోనే గురువారం పెద్ద ఎత్తున పెట్టుబడుల ఉపసంహరణలకు దిగారు. దీంతో ఈక్విటీలకు వరుసగా నాల్గోరోజూ నష్టాలు తప్పలేదు.
బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ప్రధాన సూచీ సెన్సెక్స్ 1,769.19 పాయింట్లు లేదా 2.10 శాతం దిగజారి మూడు వారాల కనిష్ఠాన్ని తాకుతూ 82,497.10 వద్దకు పరిమితమైంది. గత నెల సెప్టెంబర్ 11 తర్వాత సూచీకి ఇదే అత్యల్ప స్థాయి. ఇక ఒకానొక దశలోనైతే 1,832.27 పాయింట్లు కోల్పోయింది. సెన్సెక్స్‌లోని 30 షేర్లలో జేఎస్‌డబ్ల్యూ స్టీల్ తప్ప మిగతావన్నీ నష్టాలనే మూటగట్టుకోవాల్సి వచ్చింది. మరోవైపు నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ) సూచీ నిఫ్టీ కూడా దారుణంగా తగ్గింది. 546.80 పాయింట్లు లేదా 2.12 శాతం కూలింది. చివరకు 25,250.10 వద్ద స్థిరపడింది.
మంగళవారం రాత్రి ఇజ్రాయెల్‌పై ఇరాన్ క్షిపణుల దాడి జరిగిన నేపథ్యంలో ఊహించినట్టుగానే గురువారం ఉదయం ఆరంభం నుంచే సూచీలు నష్టాల్లోకి జారుకున్నాయి. బుధవారం గాంధీ జయంతి కారణంగా దేశీయ మార్కెట్లకు సెలవు. దీంతో ఆ ప్రభావం మరుసటి రోజు ట్రేడింగ్‌లో స్పష్టంగా కనిపించింది. విదేశీ సంస్థాగత మదుపరులు (ఎఫ్ఐఐ) తమ పెట్టుబడులను భారతీయ మార్కెట్ల నుంచి వెనక్కి తీసుకుంటూనే ఉండటం, మిడిల్ఈస్ట్ ఉద్రిక్తతలతో పెరిగిన ముడి చమురు ధరలు, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ (ఎఫ్‌అండ్‌వో) సెగ్మెంట్‌పై మార్కెట్స్ రెగ్యులేటర్ సెబీ తెచ్చిన కఠిన నిబంధనలు సైతం మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీశాయని నిపుణులు ట్రేడింగ్ సరళిని విశ్లేషిస్తున్నారు. ఇక సెన్సెక్స్‌లో ఎల్అండ్టీ, రిలయన్స్ ఇండస్ట్రీస్, యాక్సిస్ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్, టాటా మోటర్స్ షేర్లు భారీగా నష్టపోయాయి. బీఎస్ఈ మిడ్‌క్యాప్ 2.27 శాతం, స్మాల్‌క్యాప్ 1.84 శాతం చొప్పున క్షీణించాయి. రంగాలవారీగా రియల్టీ (4.49 శాతం), క్యాపిటల్ గూడ్స్ (3.18 శాతం) అత్యధికంగా నష్టపోయాయి.
స్టాక్ మార్కెట్ల భారీ నష్టాల నడుమ మదుపరుల సంపద కూడా పెద్ద ఎత్తునే కరిగిపోయింది. ఈ ఒక్కరోజే దాదాపు రూ.10 లక్షల కోట్ల మేర హరించుకుపోయింది. బీఎస్ఈ నమోదిత సంస్థల మార్కెట్ విలువ రూ.9,78,778.57 కోట్లు దిగజారి రూ.4,65,07,685.08 కోట్లకు పరిమితమైంది. మొత్తంగా గడిచిన నాలుగు రోజుల్లో సుమారు రూ.15 లక్షల కోట్ల మదుపరుల సంపద ఆవిరైపోవడం గమనార్హం.
ఈ నెల 14న హ్యుందాయ్ మోటర్ ఇండియా లిమిటెడ్ పబ్లిక్ ఇష్యూ రావచ్చని సమాచారం. దేశ చరిత్రలోనే మునుపెన్నడూ లేనివిధంగా భారీ ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో)కు ఈ దక్షిణ కొరియా ఆటో దిగ్గజం సిద్ధమైన విషయం తెలిసిందే. ఏకంగా రూ.25,000 కోట్లతో వస్తున్నది మరి.
రూపాయి మారకం విలువ అంతకంతకూ పడిపోతున్నది. ఫారెక్స్ మార్కెట్లో డాలర్ ముందు ఏమాత్రం నిలదొక్కుకోలేక రోజుకింత చతికిలపడుతున్నది. గురువారం ఒక్కరోజే 14 పైసలు కోల్పోయిన దేశీయ కరెన్సీ.. గత 5 రోజుల్లో 38 పైసలు క్షీణించడం గమనార్హం. ప్రస్తుతం 83.96 వద్ద స్థిరపడగా, ఒకానొక దశలో 84 మార్కుకు దిగజారింది. కాగా, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలతో పెరుగుతున్న ముడి చమురు ధరలు ప్రభావితం చేస్తున్నట్టు ఫారెక్స్ ట్రేడర్లు తాజా సరళిని విశ్లేషిస్తున్నారు. స్టాక్ మార్కెట్ల భారీ పతనం, దూరమవుతున్న విదేశీ పెట్టుబడులు సైతం దెబ్బతీస్తున్నట్టు వారు పేర్కొంటున్నారు.