Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లలో నష్టాలు కొనసాగుతున్నాయి. అదానీ గ్రూప్ షేర్ల పతనం, విదేశీ నిధుల ఉపసంహరణ నేపథ్యంలో గురువారం బెంచ్‌మార్క్ సూచీలు మరోసారి పతనమవుతున్నాయి. వరుస ఏడు సెషన్లలో నష్టాల అనంతరం మంగళవారం లాభాలను నమోదు చేశాయి. ఆసియా మార్కెట్లలో ప్రతికూల పవనాల నేపథ్యంలో మార్కెట్లు పడిపోతున్నాయి. ఈ క్రమంలో గురువారం ప్రారంభంలోనే బీఎస్ఈ సెన్సెక్స్ 468.17 పాయింట్లు పతనమై.. 77,110.21 వద్ద మొదలైంది. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ 179.75 పాయింట్లు పతనమై.. 23,338.75 పాయింట్ల వద్ద షురూ అయ్యింది. సోలార్ విద్యుత్ కాంట్రాక్ట్ విషయంలో అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీపై అమెరికాలో వారెంట్ జారీ అయ్యింది.
అదానీతో పాటు ఏడుగురు యూఎస్‌లో బిలియన్ డాలర్ల విలువైన లంచం ఇవ్వడంతో పాటు మోసానికి పాల్పడ్డట్లుగా ఆరోపణలున్నాయి. ఈ విషయంలో అమెరికా కోర్టులో విచారణ జరిగింది. ఈ క్రమంలో అదానీ, ఆయన మేనల్లుడిపై వారెంట్లు జారీ అయ్యాయి. అమెరికా, విదేశీ ఇన్వెస్టర్ల నుంచి రూ.వేలకోట్ల సంపదను ఆకర్షించినట్లు గౌతమ్ అదానీపై అభియోగాలను నమోదు చేశారు. ఈ క్రమంలో సెన్సెక్స్ స్టాక్స్‌లో అదానీ పోర్ట్స్ 10 శాతం పడిపోయింది. అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్‌తో సహా ఇతర అదానీ గ్రూప్ స్టాక్స్ సైతం ప్రారంభ ప్రారంభంలోనే భారీగా పతనమయ్యాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండస్ఇండ్ బ్యాంక్, ఎన్టీపీసీ, టాటా మోటార్స్ సైతం నష్టాల్లో ఉన్నాయి.
ఇన్ఫోసిస్, హెచ్‌సీఎస్ టెక్నాలజీస్, టాటా కన్సల్టెన్సీ, టెక్ మహీంద్రా లాభాల్లో ఉన్నాయి. మంగళవారం విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (FIIs) రూ.3,411.73 కోట్ల విలువైన పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. ఆసియా మార్కెట్లలో టోక్యో, షాంఘై, హాంకాంగ్ పతనమైంది. అమెరికా మార్కెట్లు ఎక్కువగా పాజిటివ్ జోన్లో ముగిశాయి. గ్లోబల్ ఆయిల్ బెంచ్‌మార్క్ బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు 0.25 శాతం పెరిగి 72.99 డాలర్లకు చేరుకుంది. ప్రస్తుతం సెన్సెక్స్ 556.15 పాయింట్లు పతనమై.. 77,022 పాయింట్ల వద్ద ట్రేడవుతున్నది. నిఫ్టీ 191.15 పాయింట్లు పతనమై.. 23,327.17 పాయింట్ల వద్ద కొనసాగుతున్నది.