ముంబై, మార్చి 30: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడోరోజు లాభపడ్డాయి. రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య జరుగుతున్న శాంతి చర్చలతో సమస్య త్వరలో కొలిక్కి వచ్చే అవకాశాలు ఉండటంతో దేశీయ సూచీలు భారీగా పుంజుకున్నాయి. బ్లూచిప్ సంస్థలైన ఆర్ఐఎల్, ఇన్ఫోసిస్, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లకు మదుపరుల నుంచి లభించిన మద్దతుతో ఆరువారాల గరిష్ఠ స్థాయిని తాకింది. సెన్సెక్స్, నిఫ్టీలు ఒక్కశాతానికి పైగా లాభపడ్డాయి. ఒక దశలో 800 పాయింట్లకు పైగా లాభపడిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ చివరకు 740.34 పాయింట్లు లేదా 1.28 శాతం లాభపడి 58,683.99 వద్ద ముగిసింది. డెరివేటివ్ కాంట్రాక్టు గడువు ముగియనుండటంతో మదుపరులు కొనుగోళ్ళకు మొగ్గుచూపారు. దీంతో 30 షేర్ల ఇండెక్స్‌లో 21 షేర్లు లాభాల్లో ముగిశాయి. అలాగే ఎన్ఎస్ఈ నిఫ్టీ 172.95 పాయింట్లు అందుకొని 17,498.25 వద్ద నిలిచింది. ఫిబ్రవరి 10 తర్వాత సూచీలకు ఇదే గరిష్ఠ స్థాయి. గడిచిన మూడు రోజుల్లో సెన్సెక్స్ 1,321 పాయింట్లు(2.29 శాతం), నిఫ్టీ 345 పాయింట్లు(2 శాతం) లాభపడింది.