Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం స్వల్ప లాభాల్లో ముగిశాయి. ఉదయం భారీ లాభాలతో మొదలైన సూచీలు.. ఆ తర్వాత స్వల్పంగా దిగజారాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల పవనాలతో మార్కెట్లు లాభాల్లో మొదలయ్యాయి. క్రితం సెషన్‌తో పోలిస్తే ఉదయం సెన్సెక్స్ 81,832.66 పాయింట్ల వద్ద లాభాల్లో మొదలైంది. ఇంట్రాడేలో 81,538.94 పాయింట్లను పడిపోయిన సెన్సెక్స్.. అత్యధికంగా 82,002.84 పాయింట్ల గరిష్ఠాన్ని తాకింది. చివరకు 144.30 పాయింట్ల లాభంతో 81,611.41 వద్ద స్థిరపడింది. ఇక నిఫ్టీ 16.50పాయింట్లు పెరిగి.. 24,998.45 వద్ద స్థిరపడింది.
ట్రేడింగ్‌లో దాదాపు 2,152 షేర్లు పెరగ్గా.. మరో 1,585 షేర్లు పతనమయ్యాయి. నిఫ్టీలో కోటక్ మహీంద్రా బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, భారత్ ఎలక్ట్రానిక్స్, మారుతీ సుజుకీ, పవర్ గ్రిడ్ కార్ప్ లాభపడ్డాయి. సిప్లా, ట్రెంట్, టెక్ మహీంద్రా, సన్ ఫార్మా, హీరో మోటోకార్ప్ నష్టపోయాయి. సెక్టోరల్‌లో ఐటీ ఇండెక్స్ ఒక శాతం, ఫార్మా ఇండెక్స్ 2శాతం, రియాల్టీ ఇండెక్స్ 0.4 శాతం తగ్గుముఖం పట్టాయి. బ్యాంక్ ఇండెక్స్ ఒకశాతం, పవర్ ఇండెక్స్ 0.7శాతం, మెటల్స్ ఇండెక్స్ 0.3 శాతం పెరిగాయి. బీఎస్ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.3 శాతం పతనం కాగా.. స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.4శాతం పెరిగింది.