ముంబై, అక్టోబర్ 3: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండోరోజూ లాభాల్లో ముగిశాయి. మెటల్, టెలికాం సూచీలకు మదుపరుల నుంచి లభించిన మద్దతుకు తోడు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల అంశాలు కూడా సూచీల్లో జోష్ పెంచింది. 600 పాయింట్ల శ్రేణిలో కదలాడిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ చివరకు 81 వేల పాయింట్ల పైకి చేరుకున్నది. వారాంతం ట్రేడింగ్ ముగిసే సరికి 223.86 పాయింట్లు అందుకొని 81,207.17 వద్ద స్థిరపడింది.
శుక్రవారం 2,710 షేర్లు లాభాల్లో ముగియగా, 1,490 సూచీలు నష్టపోయాయి. మరోవైపు, ఎన్ఎస్ఈ నిఫ్టీ 57.95 పాయింట్లు అందుకొని 24,894.25 వద్ద స్థిరపడింది. మొత్తం మీద ఈవారంలో సెన్సెక్స్ 780.71 పాయింట్లు, నిఫ్టీ 239.55 పాయింట్ల చొప్పున అధికమయ్యాయి. మెటల్, కన్జ్యూమర్ డ్యూరబుల్ సూచీలు ఆకట్టుకోవడం, ఈ నెలలోనే అమెరికా ఫెడరల్ రిజర్వు వడ్డీరేట్లను తగ్గించే అవకాశాలుండటం కూడా సూచీలకు కలిసొచ్చిందని జియోజిట్ ఇన్వెస్ట్మెంట్స్ లిమిటెడ్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు.
సూచీల్లో టాటా స్టీల్ అత్యధికంగా 3.40 శాతం ఎగబాకి టాప్ గెయినర్‌గా నిలిచింది. దీంతో పాటు పవర్ గ్రిడ్, యాక్సిస్ బ్యాంక్, కొటక్ మహీంద్రా బ్యాంక్, లార్సెన్ అండ్ టుబ్రో, భారత్ ఎలక్ట్రానిక్స్, భారతీ ఎయిర్టెల్ షేర్లు లాభాల్లో ముగిశాయి. కానీ, టెక్ మహీంద్రా, మారుతి, అల్ట్రాటెక్ సిమెంట్, బజాజ్ ఫిన్సర్వ్ షేర్లు నష్టపోయాయి. రంగాలవారీగా మెటల్ అత్యధికంగా 1.85 శాతం ఎగబాకింది.
గత కొన్ని వారాలుగా పెరుగుతూ వచ్చిన విదేశీ మారకం నిల్వలు భారీగా తరిగిపోయాయి. సెప్టెంబర్ 26తో ముగిసిన వారాంతానికిగాను ఫారెక్స్ రిజర్వులు 2.3 బిలియన్ డాలర్లు కరిగిపోయి 700.236 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. అంతక్రితం వారంలోనూ రిజర్వులు తరిగిపోయాయి. విదేశీ కరెన్సీ రూపంలో ఉన్న ఆస్తుల విలువ పడిపోవడం వల్లనే విదేశీ నిల్వలు తగ్గాయని రిజర్వుబ్యాంక్ తన వారాంతపు సమీక్షలో వెల్లడించింది.
గత వారంలో 4.393 బిలియన్ డాలర్లు తగ్గి 581.757 బిలియన్ డాలర్లకు పడిపోయాయని తెలిపింది. అలాగే గోల్డ్ రిజర్వులు కూడా 2.238 బిలియన్ డాలర్లు తగ్గి 95.017 బిలియన్ డాలర్లకు పడిపోగా, స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ 90 మిలియన్ డాలర్లు తగ్గి 18.789 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయని తెలిపింది.