ముంబై, సెప్టెంబర్ 17: దేశీయ స్టాక్ మార్కెట్లు కదంతొక్కాయి. రికార్డుల మీద రికార్డులు బద్దలు కొడుతున్న సెన్సెక్స్ మంగళవారం 83 వేల మైలురాయిని అధిగమించింది. మార్కెట్ చరిత్రలో ఇంతటిస్థాయికి చేరుకోవడం ఇదేతొలిసారి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల పవనాలకు తోడు వడ్డీరేట్ల తగ్గింపునకు అమెరికా ఫెడరల్ మొగ్గుచూపే అవకాశం ఉన్నట్లు వచ్చిన సంకేతాలు మదుపరులను కొనుగోళ్ల వైపు నడిపించాయి. నష్టాల్లో ప్రారంభమైన సూచీలకు గ్లోబల్ మార్కెట్లు భారీగా లాభపడటంతో దేశీయ సూచీలు ఎగిశాయి. ఇంట్రాడేలో 160 పాయింట్లకు పైగా లాభపడి 83,152.41 పాయింట్ల గరిష్ఠ స్థాయిని తాకిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ చివరకు 90.88 పాయింట్లు అందుకొని చారిత్రక గరిష్ఠ స్థాయి 83,079.66 వద్ద ముగిసింది.
మరో సూచీ నిఫ్టీ సైతం లైఫ్‌టైం హై 25,400 పాయింట్ల పైన ముగిసింది. చివరకు 34.80 పాయింట్లు ఎగబాకి 25,418.55 వద్ద స్థిరపడింది. స్టాక్ మార్కెట్లు పాజిటివ్‌లోనే కదలాడుతున్నాయని, ఫెడ్ వడ్డీరేట్లను పావుశాతం తగ్గించే అవకాశాలుండటం సూచీల్లో జోష్ పెంచిందని జియోజిట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు. అలాగే కూరగాయల ధరలు శాంతించడంతో ఆగస్టు నెలకుగాను టోకు ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం నాలుగు నెలల కనిష్ఠ స్థాయికి పడిపోవడం కూడా కలిసొచ్చిందన్నారు.
నూతనంగా స్టాక్ మార్కెట్లో లిైస్టెన బజాజ్ హౌజింగ్ షేరు కదంతొక్కుతున్నది. వరుసగా రెండోరోజు కూడా కంపెనీ షేరు 10 శాతం పెరిగి అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. స్టాక్ మార్కెట్ ముగిసే సమయానికి బీఎస్ఈలో కంపెనీ షేరు 10 శాతం లాభపడి రూ.181.48 వద్ద ముగిసింది. దీంతో కంపెనీ మార్కెట్ విలువ మరో రూ.13,733.12 కోట్లు పెరిగి రూ.1,51,139.21 కోట్లకు చేరుకున్నది. ఇష్యూ ధర రూ.70తో పోలిస్తే గత రెండు రోజుల్లో షేరు ధర 159.28 శాతం ఎగబాకింది. రూ.150 వద్ద బీఎస్ఈ, ఎన్ఎస్ఈ వద్ద లిైస్టెనది తెలిసిందే.