Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు వరుస నష్టాలను దాటి లాభాల్లో కొనసాగుతున్నాయి. గురువారం మార్కెట్లు స్వల్ప నష్టాలతోనే మొదలై.. ఆ తర్వాత లాభాల బాటపట్టాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 245.27 పాయింట్లు పెరిగి.. 77936.22 పాయింట్లు, నిఫ్టీ 76.7 పాయింట్లు పెరిగి.. 23,635.75 పాయింట్ల వద్ద లాభాల్లో కొనసాగుతున్నది. ఇటీవల సూచీలు అమ్మకాల ఒత్తిడితో ఒడిదుడుకులను ఎదుర్కొన్నాయి. అయితే, వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు మార్కెట్లు పతనమయ్యే అవకాశం ఉందని.. ట్రంప్ అధికారంలోకి వచ్చాక సూచీలు తిరోగమనం దిశగా వెళ్లే సూచనలున్నాయని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు.
వరుసగా పలు సంస్థల త్రైమాసిక ఫలితాల్లో ఆదాయాలు పడిపోవడం, లక్ష్యానికి మించి ద్రవ్యోల్బణం పెరగడం తదితర కారణాలతో మార్కెట్లు పతనమవుతున్నాయి. దేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం అక్టోబర్లో 14 నెలల గరిష్ఠానికి పెరిగి 6.21 శాతానికి చేరింది. ఆగస్టు 2023లో వినియోగదారుల ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం 6శాతంగా ఉన్నది. ఈ ఏడాది సెప్టెంబర్లో ఇది 5.49 శాతం నమోదవగా.. గతేడాది అక్టోబర్లో 4.87 శాతంగా రికార్డయ్యింది. ఆహార ద్రవ్యోల్బణం పెరుగుదల నేపథ్యంలో రిటైల్ ద్రవ్యోల్బణం పెరుగుదలకు కారణమని ఆర్బీఐ పేర్కొంది.
దీనికి తోడు విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు ఇన్వెస్ట్మెంట్ని ఉపసంహరించుకుంటున్న నేపథ్యంలో సూచీలు పడిపోతున్నాయి. మరో అమెరికా మార్కెట్లు గత సెషన్లో ఫ్లాట్గా ముగిశాయి. ఎస్అండ్పీ 0.02 శాతం పెరగ్గా.. నాస్డాక్ 0.14 శాతం పతనమైంది. శుక్రవారం అమెరికా ఆర్థిక వ్యవస్థపై యూఎస్ ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ జెరోమ్ పావెల్ ప్రసంగించనున్నారు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం మార్కెట్లో ఐచర్ మోటార్స్, జేఎస్డబ్ల్యూ స్టీల్, హిందాల్కో, హెచ్డీఎఫ్సీ లైఫ్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తదితర షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. హెచ్యూఎల్, బ్రిటానియా, బీపీసీఎల్, ఐటీసీ, ట్రెంట్ నష్టాల్లో ట్రేడవుతున్నాయి.