Stock Markets | ముంబై, సెప్టెంబర్ 27: స్టాక్ మార్కెట్ల ర్యాలీకి బ్రేక్ పడింది. రోజుకొక రికార్డు స్థాయికి చేరుకున్న సూచీల జోరుకు ఎట్టకేలకు బ్రేక్‌పడింది. మదుపరులు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడంతో వారాంతం ట్రేడింగ్‌లో సూచీలకు నష్టాలే మిగిలాయి. ఒక దశలో 86 వేల పాయింట్లకు చేరువైన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్.. బ్లూచిప్ సంస్థల షేర్లలో ప్రాఫిట్ బుకింగ్ జరగడంతో భారీగా నష్టపోయింది. ఇంట్రాడేలో 85,978.25 పాయింట్ల గరిష్ఠ స్థాయిని తాకిన సెన్సెక్స్ చివరకు 264.27 పాయింట్లు నష్టపోయి 85,571.85 వద్ద ముగిసింది. బ్యాంకింగ్, ఎఫ్ఎంసీజీ రంగ షేర్లు ఒత్తిడికి లోనుకావడం సూచీల పతనానికి ఆజ్యంపోశాయి. మరోవైపు వరుసగా ఆరు రోజులుగా పెరుగుతూ వచ్చిన ఎన్ఎస్ఈ నిఫ్టీ సైతం 37.10 పాయింట్లు కోల్పోయి 26,178.95 వద్ద స్థిరపడింది. ఈ భారీ నష్టాలను రిలయన్స్ షేరు కొంతమేర నిలువరించింది. ఈవారంలో సెన్సెక్స్ 1,027.54 పాయింట్లు(1.21 శాతం), నిఫ్టీ 388 పాయింట్లు(1.50 శాతం) చొప్పున లాభపడ్డాయి.
విద్యుత్ సంస్థ పవర్‌గ్రిడ్ షేరు భారీగా నష్టపోయింది. కంపెనీ షేరు 3 శాతం నష్టపోవడంతో టాప్ లూజర్‌గా నిలిచింది. దీంతోపాటు భారతీ ఎయిర్టెల్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, కొటక్ బ్యాంక్, ఎల్అండ్టీ, అదానీ పోర్ట్స్, అల్ట్రాటెక్ సిమెంట్, హెచ్‌యూఎల్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, యాక్సిస్ బ్యాంక్, నెస్లె, టాటా మోటర్స్‌లు నష్టపోయాయి. కానీ సన్‌ఫార్మా, రిలయన్స్, టైటాన్, హెచ్‌సీఎల్ టెక్, ఏషియన్ పెయింట్, మారుతి, ఎన్టీపీసీ, ఇండస్ఇండ్ బ్యాంక్, టాటా స్టీల్, టీసీఎస్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, ఎస్బీఐ, మహీంద్రా, ఐటీసీలు లాభాల్లో ముగిశాయి.