ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ లాభాలతో ముగిశాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన బెంచ్ మార్క్ సూచీలు 1 శాతానికి పైగా లాభపడ్డాయి. అంతర్జాతీయ సానుకూల పవనాలు, రూపాయి బలపడటం, ఎఫ్‌డీఐల వెల్లువ లాంటి పరిణామాలు మార్కెట్ల ర్యాలీకి దోహదం చేశాయి. ఇక చివరకు, సెన్సెక్స్ 765.04 పాయింట్లు (1.36% ) లాభపడి 56,889.76 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 225.80 పాయింట్లు (1.35%) లాభపడి 16,931 వద్ద ముగిసింది.
ఇవాళ ఫారెక్స్ మార్కెట్లో డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ 31 పైసలు బలపడి రూ.73.38కి చేరడం కూడా మార్కెట్లకు కలిసొచ్చింది. ఇవాళ్టి ట్రేడింగ్‌లో భారతీ ఎయిర్ టెల్, దివిస్ ల్యాబ్స్, యాక్సిస్ బ్యాంక్, టాటా స్టీల్, కోల్ ఇండియా కంపెనీలు నిఫ్టీలో అగ్రస్థానంలో ఉన్నాయి. టెక్ మహీంద్రా, ఐచర్ మోటార్స్, నెస్లే, ఇన్ఫోసిస్, టీసీఎస్ షేర్లు టాప్ లూజర్లలో ఉన్నాయి. ఐటీ మినహా ఇతర అన్ని సూచీలు లాభాలతో ముగిశాయి.