ముంబై, మార్చి 25: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుస లాభాలతో కళకళలాడుతున్నాయి. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల దెబ్బకు కుప్పకూలిన మార్కెట్లు ప్రస్తుతం తిరిగి కోలుకుంటున్నాయి. వరుసగా రెండోరోజూ బుధవారం కూడా సూచీలు కదంతొక్కాయి. ఫలితంగా ఇంట్రాడేలో 1,800 పాయింట్ల వరకు లాభపడిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ చివరకు మార్కెట్ ముగిసే సమయానికి 1,205 పాయింట్లు లేదా 1.63 శాతం అందుకొని 75,273.45 పాయింట్ల వద్ద ముగిసింది.
మరో సూచీ నిఫ్టీ సైతం 394.05 పాయింట్లు అందుకొని 23,306.45 పాయింట్ల వద్ద నిలిచింది. దీంతో మదుపరుల సంపద అమాంతం పెరిగింది. వరుసగా రెండు రోజుల్లో సెన్సెక్స్ 2,577 పాయింట్లు లాభపడింది. దీంతో మదుపరులు రూ.15.80 లక్షల కోట్ల సంపదను పోగేశారు. బీఎస్ఈలో లిైస్టెన కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ విలువ రూ.15,80,204.92 కోట్లు పెరిగి రూ.4,31,01,834.74 కోట్లు(4.59 ట్రిలియన్ డాలర్లు)కు చేరుకున్నది.