ముంబై, జూలై 11: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడోరోజు నష్టపోయాయి. ఐటీ, వాహన, ఎనర్జీ రంగ షేర్లలో అమ్మకాలు పోటెత్తడంతో ఇరు సూచీలు ఒక్క శాతం వరకు పతనం చెందాయి. ప్రారంభంలో లాభపడిన సూచీలకు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన ప్రతికూల సంకేతాలు సూచీలను నష్టాలవైపు నడిపించాయి. ఇంట్రాడేలో 700 పాయింట్లకు పైగా నష్టపోయిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ చివరకు మార్కెట్ ముగిసే సమయానికి 689.81 పాయింట్లు కోల్పోయి 83 వేల పాయింట్ల దిగువకు 82,500 వద్దకు జారుకున్నది. మొత్తం సూచీల్లో 2,450 షేర్లు నష్టపోగా, 1,557 షేర్లు లాభాల్లో ముగిశాయి. మరో సూచీ నిఫ్టీ 205.40 పాయింట్లు కోల్పోయి 25,149.85 వద్ద ముగిసింది. మొత్తంమీద ఈవారంలో సెన్సెక్స్ 932.42 పాయిం ట్లు(1.11 శాతం), నిఫ్టీ 311.15 పాయింట్లు (1.22 శాతం) నష్టపోయింది.
దేశీయ ఐటీ దిగ్గజం టీసీఎస్ నిరుత్సాహక ఆర్థిక ఫలితాలు ప్రకటించడం మదుపరుల్లో ఆందోళనను పెంచింది. ఫలితంగా అమ్మకాల బటన్ నొక్కడంతో ఐటీ, టెలికాం, వాహన, రియల్టీ, ఆయిల్ అండ్ గ్యాస్ రంగ షేర్లు కుదేలయ్యాయని మెహతా ఈక్విటీస్ లిమిటెడ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ప్రశాంత్ తాప్సీ తెలిపారు. సూచీల్లో టీసీఎస్ షేరు 3.46 శాతం నష్టపోయి టాప్ లూజర్‌గా నిలిచింది. దీంతోపాటు మహీంద్రా అండ్ మహీంద్రా, భారతీ ఎయిర్టెల్, టాటా మోటర్స్, టైటాన్, హెచ్‌సీఎల్ టెక్నాలజీ, బజాజ్ ఫైనాన్స్, రిలయన్స్, ట్రెంట్, ఇన్ఫోసిస్, హెచ్డీఎఫ్సీ షేర్లు నష్టపోయాయి. కానీ, హెచ్‌యూఎల్ షేరు 4.61 శాతం ఎగబాకి టాప్ గెయినర్‌గా నిలిచింది.