Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం నష్టాలతోనే ప్రారంభమయ్యాయి. ట్రేడింగ్ ప్రారంభంలో నిఫ్టీ వంద పాయింట్లకుపైగా పడిపోయి.. 17,400 దిగువన ట్రేడవుతున్నది. సెన్సెక్ 374 పాయింట్ల పతనమైంది. ప్రస్తుతం 58,429 పాయింట్ల వద్ద, నిఫ్టీ 17374 పాయింట్ల వద్ద ట్రేడవుతున్నాయి. అంతర్జాతీయంగా నెలకొన్న ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. భారత స్టాక్ మార్కెట్లతో పాటు అమెరికా స్టాక్ మార్కెట్లు సైతం సోమవారం భారీ నష్టాలతో ముగిశాయి. ఆసియా పసిఫిక్-సూచీలు సైతం నష్టాల్లోనే ఉన్నాయి.
అయితే, అమెరికా ఫెడరల్ రిజర్వ్ కఠినంగా వ్యవహరించనుందనే సంకేతాల మధ్య మదుపరులు అప్రమత్తమై పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్నారు. ట్రేడింగ్ ప్రారంభంలో నిఫ్టీ మిడ్‌క్యాప్ 100, నిఫ్టీ స్మాల్‌క్యాప్ 100 0.7 శాతానికిపైగా పడిపోయాయి. సెన్సెక్ 30 సూచీలో ఎంఅండ్ఎం, బజాజ్ ఫిన్‌సర్వీస్, పవర్ గ్రిడ్, ఎన్టీపీసీ, సన్‌ఫార్మా, అల్ట్రాటెక్ సిమెంట్, ఎల్అండ్టీ, మారుతి షేర్లు లాభాల్లో ఉన్నాయి. ఇన్ఫోసిస్, విప్రో, టెక్ మహీంద్రా సూచీలు భారీగా నష్టపోయాయి. నిఫ్టీ ఐటీ, నిఫ్టీ మెటల్ సూచీలు ట్రేడింగ్‌లో దెబ్బతినడంతో అన్ని రంగాలు నెగిటివ్ జోన్లో ప్రారంభమయ్యాయి. వ్యక్తిగత స్టాక్‌లలో ఇన్ఫోసిస్ షేర్లు 2 శాతానికిపైగా పడిపోయాయి. రూ.3వేల కోట్ల నిధుల సమీకరణకు బోర్డు ఆమోదించిన తర్వాత ఆర్బీఎల్ బ్యాంక్ షేర్లు 2 శాతానికిపైగా లాభపడ్డాయి.