హైదరాబాద్, ఫిబ్రవరి 7 (నమస్తే తెలంగాణ): మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నిక సందర్భంగా ఎక్స్అఫిషియో సభ్యులు ఓటింగ్‌లో పాల్గొనడంపై గతంలో హైకోర్టు డివిజన్ బెంచ్ జారీచేసిన మార్గదర్శకాలను ప్రభుత్వం అమలు చేయాల్సిందేనని సింగిల్ జడ్జి స్పష్టంచేశారు. ఎమ్మెల్యేలు, లోక్‌సభ సభ్యులు వారి నియోజకవర్గాల పరిధిలోని ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులు మున్సిపాలిటీల్లో ఓటు హకు వినియోగించుకోవాలని గతంలో ద్విసభ్య ధర్మాసనం ఆదేశించింది. దీంతో ఎక్స్అఫిషియో సభ్యులు ఎవరెవరు ఓటు వేయాలనేది మున్సిపల్ చట్టసభ్యులు ఎంచుకోవాలని ప్రజాప్రతినిధులకు నిర్మల్ కలెక్టర్ లేఖ రాయడాన్ని సవాలు చేస్తూ కత్తి నరేందర్ దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ ఎన్వీ శ్రవణ్‌కుమార్ విచారణ చేపట్టారు.