Stock Markets | అంతర్జాతీయ మార్కెట్ల దారిలోనే దేశీయ స్టాక్ మార్కెట్లు పయనించాయి. అమెరికాలో ధరలను కట్టడి చేయడానికి యూఎస్ ఫెడ్ రిజర్వు చైర్మన్ జెరోమ్ పావెల్ 75 బేసిక్ పాయింట్లు వడ్డీరేట్లు పెంచారు. మున్ముందు మరింత కఠినంగా వ్యవహరిస్తామని ప్రకటించారు. తద్వారా మరిన్ని సార్లు వడ్డీరేట్ల పెంపు ఉంటుందని సంకేతాలిచ్చారు. దీనివల్ల ఆర్థిక మాంద్యం ముప్పు తలెత్త వచ్చునని కూడా హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లలో సెంటిమెంట్ బలహీన పడింది. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్ఈ) ఇండెక్స్ సెన్సెక్స్, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్ఎస్ఈ) సూచీ నిఫ్టీ 0.5 శాతం నష్టాలతో ముగిశాయి.
సెన్సెక్స్ 337 పాయింట్ల నష్టంతో 59,119 పాయింట్ల వద్ద స్థిర పడగా, నిఫ్టీ 88 పాయింట్ల పతనంతో 17,630 పాయింట్లతో సరిపెట్టుకున్నది. బ్యాంకింగ్, ఫైనాన్సియల్ సర్వీసెస్ సంస్థల స్క్రిప్టులు ఒకశాతానికిపైగా పతనం అయ్యాయి. ప్రస్తుతం పండుగల సీజన్ కావడంతో గ్రుహోపకరణాలతో కూడిన ఎఫ్ఎంసీజీ, మీడియా సంస్థల షేర్లు లాభ పడ్డాయి.
పవర్ గ్రిడ్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ రెండు శాతానికి పైగా నష్టపోయాయి. మరోవైపు టైటాన్, హిందూస్థాన్ యూనీ లివర్ (హెచ్యూఎల్), ఏషియన్ పెయింట్స్ లాభపడ్డాయి. ఇండెక్సుల వారీగా ఎఫ్ఎంసీజీ, మీడియా ఇండెక్సులే నిలకడగా కొనసాగాయి.
జపాన్ స్టాక్ మార్కెట్లో షేర్లు రెండు నెలల కనిష్ఠ స్థాయికి పడిపోయాయి. అమెరికా ఫెడ్ రిజర్వ్ నిర్ణయానికి అనుగుణంగా ఆల్ట్రా ఈజీ మానిటరీ పాలసీని కొనసాగిస్తున్నట్లు బ్యాంక్ ఆఫ్ జపాన్ ప్రకటించడమే దీనికి కారణం. ఫలితంగా నిక్కీ 225 పాయింట్ల పతనమైంది. హాంకాంగ్ స్టాక్స్ దాదాపు 11 ఏళ్ల కనిష్ఠ స్థాయికి పతనం అయ్యాయి. హాంగ్ సెంగ్ ఇండెక్స్ 1.6 శాతం నష్టంతో 18,147.95 పాయింట్లకు చేరుకుంది. ఇది 20211 డిసెంబర్ 20 తర్వాత అత్యంత కనిష్టం. ఇక చైనా షాంఘై కాంపొజిట్ ఇండెక్స్ సైతం 0.2 శాతం నష్టంతో ముగిసింది.