ముంబై, సెప్టెంబర్ 26: దేశీయ స్టాక్ మార్కెట్ల ర్యాలీ నిరాటంకంగా కొనసాగుతున్నది. గురువారం మరో ఉన్నత శిఖరాలను అధిగమించింది. బ్యాంకింగ్ షేర్లు ఇచ్చిన దన్నుతోపాటు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల అంశాలతో సెన్సెక్స్ 86 వేల పాయింట్లకు చేరువైంది. నెలవారీ డెరివేటివ్ కాంట్రాక్టు గడువు ముగుస్తుండటంతో మదుపరులు ఎగబడి కొనుగోళ్లు జరిపారు. దీంతో ఇంట్రాడేలో 86 వేల పాయింట్లకు చేరువలో వచ్చిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ చివరకు మార్కెట్ ముగిసే సమయానికి 666.25 పాయింట్లు అధిగమించి 85,836.12 వద్ద ముగిసింది. ఇది కూడా సూచీలకు గరిష్ఠ స్థాయి ముగింపు కావడం విశేషం. ఆరో రోజూ నిఫ్టీది అదే జోరు వరుసగా ఆరో రోజు కూడా భారీగా లాభపడిన నిఫ్టీ.. రికార్డు గరిష్ఠ స్థాయికి చేరుకున్నది. ఇంట్రాడేలో 246.75 పాయింట్లు లాభపడిన సూచీ.. చివర్లో మార్కెట్ ముగిసే సమయానికి 211.90 పాయింట్లు ఎగబాకి 26,216.05 వద్ద స్థిరపడింది.
దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మారుతి సుజుకీ షేరు అత్యధికంగా లాభపడింది. కంపెనీ షేరు ధర 5 శాతం లాభపడి టాప్ గెయినర్‌గా నిలిచింది. దీంతోపాటు టాటా మోటర్స్, బజాజ్ ఫిన్సర్వ్, మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా స్టీల్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, అల్ట్రాటెక్ సిమెంట్, బజాజ్ ఫైనాన్స్, నెస్లె షేర్లు కూడా అత్యధికంగా లాభపడిన షేర్లలో ఉన్నాయి.